Oct 11,2023 19:47

ప్రజాశక్తి - మండవల్లి
   అవినీతిని అరికట్టేందుకు ప్రజలకు ఉన్న ఒకే ఒక ఆయుధం సమాచార హక్కు చట్టమని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు ఎల్‌ఎస్‌.భాస్కరరావు తెలిపారు. ఈనెల 12వ తేదీన సమాచార హక్కు చట్టం 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని కానుకొల్లు జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో విద్యార్థులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో ఇద్దరు విద్యార్థులు సిద్ధపడి, ప్రతి మూడు నెలలకు ఒక ఆర్‌టిఐ ద్వారా గ్రామ పంచాయతీలోని సమాచారాన్ని అడిగి తెలుసుకుని, గ్రామంలో తెలియజేస్తే క్రమంగా అవినీతి తగ్గిపోతుందని తెలిపారు. అనంతరం ఆర్‌టిఐ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఆర్‌టిఐ ఇంగ్లీషు అక్షరాలలో వినూత్న ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక మండల అధ్యక్షుడు టి.అప్పారావు, ప్రధానోపాధ్యాయులు మాధవ కుమార్‌, ఇన్‌ఛార్జి హెచ్‌ఎం కురెళ్ల శ్యాంప్రసాద్పి, పిడికె.సత్యనారాయణ, సిహెచ్‌ ఎస్‌ఎన్‌.మూర్తి, వి.బ్రహ్మానందం, ఎం.శివకుమార్‌ పాల్గొన్నారు.