Dec 19,2021 12:16

ఒక మానవతావాదిపై వీరి ఆగ్రహం
అతడ్ని స్వదేశంలో అనాధ శవాన్నిచేస్తే..
మరో సనాతనవాదిపై వారి ఆగ్రహం
రాజ్యపు సానుభూతి గెల్చుకుంటుంది.
కొన్ని కుటిలాగ్రహాల నెత్తుటి మరకల చివళ్లకు
అగ్రకులాల అనుగ్రహాల చివుళ్లు
అలవోకగా మొలకెత్తితే..
ఇంకొన్ని ధర్మాగ్రహ నినాదాల వెనుక
దుర్మార్గపు క్రీడలు ప్రజాస్వామ్యాన్ని అడ్డదారిలో మట్టికరిపిస్తారు.
రాజుగారు తోచక చేసే షికారుల్లో
నోరులేని జంతువులు వేటగా మిగిలినట్టు
పరువూ మర్యాదలకోసం పితృస్వామ్య తందూరీల్లో
ఆడబిడ్డల మాంసం పత్రికల్లో వార్తగా మసాలా దట్టించబడి
'డిస్కషన్‌ ఓవర్‌ ఏ కాఫీ'ల్లో చర్చగా ముగుస్తుంది.
జీవనమే మరణమైన శాశ్వత చెరసాలల్లో..
అందరిలా బతకాలనే ఆకాంక్ష హక్కులకోసం నినదిస్తే
కనిపించని కొరడాలు కొన్ని స్టార్‌ బ్యాచ్‌
వీపులపై మాత్రమే నాగటిచాళ్లై వెలుస్తారు!
ప్రశ్నించే గొంతులన్నీ నిందితులుగా తర్జుమాయై
బాధితుల సమూహాలు రోడ్లపై నిరసన ధ్వనులై పెల్లుబికినపుడు,
పాలకుల కనుసన్నల్లో మెలిగే
రక్షకభట లాఠీలు మేకచర్మంలో దాగిన తోడేళ్లై
కూటికీ, కులానికీ నిరుపేదల
దేహాలను చీల్చి చెండాడతారు.
రాజ్యాంగపు హక్కులు
మతమౌఢ్యపు పాలకుల చేతిలో
గులకరాళ్లై నిర్లక్ష్యంగా విసిరేయబడ్డప్పుడు
హక్కుల పోరాటమూ ఆత్మగౌరవ ప్రకటనా
ఉగ్రవాద చర్యగా నిర్వచించబడి
విద్యార్థుల పోరాటంపై ఆధిపత్య
అహంకారం విజేతగా ప్రకటించబడుతుంది
నిచ్చెనమెట్ల వ్యవస్థలో పైనున్న ప్రతివాడూ
పీడకుడై బలికోరుతూ
కిందున్న ప్రతివాడూ పీడితుడై బలికాబడుతున్న
దారుణాలపై వివక్షతతో స్పందించే ద్వంద్వనీతుల దేశం..
అవర్ణ వివక్షితుణ్ణి పరామర్శకు నోచుకోని అస్పృశ్యుణ్ణి చేస్తుంది.
సవర్ణ వివక్షితుణ్ణి ఆలింగనం చేసుకొని కన్నీరు పెడుతుంది.

(స్వదేశంలో విదేశీయతను అనుభవించే, విదేశంలో ఉన్నా స్వదేశీ ప్రభుత్వాల అండను పొందగలిగే
మరణాలను ప్రత్యక్షంగా చూసి వలపోస్తూ..)

అరుణ గోగులమండ
88971 07984