Nov 19,2023 21:00

దెబ్బతిన్న 19వ బ్లాక్‌ ఛానల్‌ స్లూయిస్‌ గేటు

స్లూయిస్‌ గేటు టాంపర్‌కు యత్నం
- పైకెత్తి కిందికి దించిన గుర్తుతెలియని వ్యక్తులు
- పూర్తిగా కిందికి దిగిన గేటు
- పునరుద్ధరణ పనులు చేపట్టిన గంగ అధికారులు
ప్రజాశక్తి - రుద్రవరం

    తెలుగు గంగ ప్రధాన కాలువ నుండి 19వ బ్లాక్‌ ఛానల్‌కు సాగునీటిని విడుదల చేసే స్లూయిస్‌ గేటును గుర్తు తెలియని వ్యక్తులు పైకి ఎత్తి కిందికి దిగకుండా టాంపర్‌ చేసే ప్రయత్నం వికటించి గేటు పూర్తిగా కిందికి దిగిపోయింది. ఈ సంఘటనను గమనించిన గంగ అధికారులు స్లూయిస్‌ గేటు పునరుద్ధరణ పనులు చేపట్టారు. వివరాలు.. రుద్రవరం మండల పరిధిలోని తెలుగు గంగ ప్రధాన కాలువ నుండి 19వ బ్లాక్‌ ఛానల్‌ ద్వారా రైతులకు సాగునీరు ప్రవహిస్తోంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం తెల్లవారుజామున నీరు అధిక శాతంలో బ్లాక్‌ ఛానల్‌కు విడుదల చేయాలనే ఉద్దేశంతోనో లేక మరే కారణం చేతనో గానీ బ్లాక్‌ ఛానల్‌ స్లూయిస్‌ గేటును ఎత్తి తిరిగి గేటు కిందికి దిగకుండా టాంపర్‌ చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం వికటించి గేటు పూర్తిగా కిందికి దిగిపోయింది. విషయం తెలుసుకున్న గంగ అధికారులు స్లూయిస్‌ గేటును పరిశీలించి పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా గంగ ఏఈ రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పాల్పడిన సంఘటన కారణంగా బ్లాక్‌ ఛానల్‌ స్లూయిస్‌ గేటు పూర్తిగా కిందికి దిగిపోయిందన్నారు. వెంటనే సిబ్బందితో వచ్చి గేటు పునరుద్ధరణ చేపట్టామన్నారు. రైతులు సాగు చేసిన పంటలకు చివరి విడత సాగునీరు అందిస్తున్న కీలక సమయంలో ఇలాంటి సంఘటనలకు పాల్పడడం సరైనది కాదన్నారు. ఇటువంటి సంఘటనలతో పంటలకు సాగునీరు అందక రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొనే అవకాశం ఉందన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆకతాయిలు ఇలాంటి పనులు చేయవద్దని కోరారు. మళ్లీ ఇలాంటి సంఘటనలకు పాల్పడితే కేసులు పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పునరుద్ధరణ పనులు చేపడుతున్న దశ్యం
పునరుద్ధరణ పనులు చేపడుతున్న దశ్యం