ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలోని విద్యా సంస్థలకు చెందిన బస్సులన్నింటికి జూన్ 10వ తేదీలోగా తనిఖీ చేయించుకుని సామర్ధ్యం (ఫిట్‌నెస్) ధ్రువీకరణ పత్రం తప్పని సరిగా తీసుకోవాలని జిల్లా రవాణా అధికారి షేక్ కరీం తెలిపారు. ప్రతిబస్సులో అటెండరును తప్పకుండా నియమించుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. ఫిట్‌నెస్ లేని బస్సులను 10వ తేదీ తరువాత తనిఖీ చేసి సిజ్ చేస్తామని వెల్లడించారు. ప్రజాశక్తి ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలు తెలియజేశారు.
జిల్లాలో విద్యా సంస్థల బస్సులు ఎన్ని ఉంటాయి?
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 వేలకుపైగా ఉన్నాయి. నూతన గుంటూరు జిల్లాలో 900 వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు 350 బస్సుల ఫిట్‌నెస్ తనిఖీ పూర్తి చేశాం. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. 10వ తేదీలోగా ప్రతి బస్సుకు సామర్ధ్యం తనిఖీ తప్పసరని ఇప్పటికే సంబంధిత యాజమాన్యాలకు తెలియజేశాం. మరమ్మతులుంటే పూర్తి చేసుకునే ఫిట్‌నెస్ పరీక్షకు తీసుకురావాలి. పిల్లల భద్రత దృష్ట్యా ప్రతి బస్సులో విద్యార్థులను దిండచడానికి, ఎక్కించడానికి అటెండరు తప్పకుండా ఉండాలి. బస్సు డ్రైవర్లకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలను చేయించాలి. ఈ అంశంపై యాజమాన్యాలు దృష్టి సారించాలి. విద్యా సంస్థల బస్సులకు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం.
నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై తనిఖీలు
జిల్లాలోని వేర్వేరు ప్రదేశాల్లో నిత్యం తనిఖీలు చేస్తుంటాం. ఈ తనిఖీల ద్వారా నెలకు రూ.1.20 కోట్ల వరకు ఫైన్ల రూపంలో ఆదాయం వస్తుంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కంటే ఎక్కువ మంది ప్రయాణికులున్నా, లైసెన్సు, వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకున్నా జరిమానాలు విధిస్తాం.
రవాణశాఖ ద్వారా ప్రభుత్వానికి ఆదాయ లక్ష్యం?
జిల్లాలో 2022-23లో రూ.321 కోట్ల లక్ష్యం నిర్ధేశించగా రూ.261 కోట్ల ఆదాయం వచ్చింది. 2023-24లో రూ.403 కోట్ల ఆదాయం రాబట్టాలని లక్ష్యంగా నిర్ధేశించారు. వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు, త్రైమాసిక పన్నులు, రెన్యువల్స్, లైఫ్ టాక్సు తదితర అంశాల ద్వారా లక్ష్యం మేరకు ఆదాయం రాబట్టడానికి కృషి చేస్తున్నాం. వాహనాలపై పన్నులను ఇటీవల ప్రభుత్వం పెంచింది. 25 శాతం వరకు పెరిగింది. ఈనెల 15 నుంచి కొత్త పన్నులు అమలులోకి వచ్చాయి. వచ్చే త్రైమాసికం నుంచి పెంచిన పన్నులను వసూలుచేస్తాం.
ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు?
ప్రమాదాల నివారణకు ప్రతినెలా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. కళాశాలలు, కూడలి ప్రదేశాల్లో రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై వివరిస్తున్నాం. రహదారి భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాం.










