Oct 05,2023 22:43

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
           అతి తక్కువ వేతనాలతో పనిచేసే చిరుద్యోగుల పట్ల జిల్లా అధికారుల నిర్లక్ష్య వైఖరి దారుణమని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు విమర్శించారు. జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా కలెక్టర్‌ మున్సిపల్‌ స్కూల్‌ స్వీపర్ల సమస్యపై వెంటనే స్పందించి వారికి రావాల్సిన ఐదు నెలల బకాయి జీతాలు ఇప్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా డిఇఒ కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరాయి. ఈ దీక్షలను ప్రారంభించిన లింగరాజు మాట్లాడుతూ జిఒలు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని ఆయన ప్రశ్నించారు. జిఒ 84 విడుదల చేసి 15 మాసాలవుతున్నప్పటికీ దానికనుగుణంగా చర్యలు చేపట్టి మున్సిపల్‌ స్కూలు స్వీపర్ల బకాయి జీతాలు చెల్లించడంలో జిల్లా అధికారుల నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుందని ఆయన విమర్శించారు. జిల్లా అధికారులు స్పందించి స్కూల్స్‌ స్వీపర్లకు రావాల్సిన బకాయి జీతాలు ఇప్పించాలని ఆయన కోరారు. లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. జిల్లా అధికారులు కనీసం మానవత్వం లేకుండా వ్యవహరించడం దారుణమన్నారు. ఒకటో తేదీన జీతాలు రాకపోతే అల్లాడే అధికారులు, ఐదు నెలలుగా జీతాలు లేకుండా స్కూల్‌ స్వీపర్లు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ఈ దీక్షలకు యూనియన్‌ అధ్యక్షురాలు జె.స్వాతి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఈతకోట చిన్ని, వి.విజయలక్ష్మి, పి.రత్నమణి, పి.నాగమణి, కృష్ణవేణి, ఖాదరున్నీసా, ఆదిలక్ష్మి, రామలక్ష్మి, నాయకత్వం వహించారు.
మూడో రోజు దీక్షల సందర్భంగా ఆందోళనకారులు నోటికి నల్లరిబ్బన్లతో తమ నిరసన తెలిపారు. ఈ దీక్షలకు యుటిఎఫ్‌ జిల్లా నాయకులు పివి.నరసింహా రావు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జాన్‌బాబులు సంఘీభావం తెలిపారు.