Jun 08,2023 23:44

మాట్లాడుతున్న సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకరరావు

ప్రజాశక్తి-అనకాపల్లి
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో శానిటేషన్‌ నిర్వహణకు ప్రభుత్వం నియమించిన ఆయాలకు కనీస వేతనం అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు రుత్తల శంకర్రావు డిమాండ్‌ చేశారు. స్థానిక దొడ్డి రామునాయుడు భవనంలో గురువారం స్కూలు శానిటేషన్‌ ఆయాల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శంకర్రావు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పనిచేస్తున్న వీరికి నెలకి కేవలం 6 వేల రూపాయలు వేతనం చెల్లించడం దారుణమన్నారు. వీరికి ఉద్యోగ భద్రత లేదని, రక్షణ పరికరాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రక్షణ పరికరాలు ఇవ్వాలని, కనీస వేతనం రూ.18 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనేక చోట్ల రాజకీయ ఒత్తిడి, తొలగింపులు చేస్తున్నారని ఈ నేపథ్యంలో వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్మికులందరూ ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి, హక్కులు సాధనకు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం మండల స్కూల్‌ శానిటేషన్‌ ఆయాలు పల్లా దేవి, రూప, నాగమణి, నూక రత్నం, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.