Mar 05,2023 00:32

సమావేశంలో మాట్లాడుతున్న హైకోర్టు న్యాయమూర్తి సోమయాజులు

ప్రజాశక్తి-సీతమ్మధార : రాజ్యాంగంలో న్యాయవ్యవస్థ ఎంతో శక్తివంతమైనదని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డివిఎస్‌ఎస్‌ సోమయాజులు అన్నారు. పౌర గ్రంథాలయంలో సెంటర్‌ ఫర్‌ పాలసీ స్టడీస్‌ ఆధ్వర్యాన శనివారం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగం అన్నిటికన్నా బలమైనదన్నారు. న్యాయ సమీక్ష గురించి పలువులు న్యాయవాదులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల గురించి వివరించారు. అనేక కీలక అంశాల్లో న్యాయవ్యవస్థ తీర్పులను ప్రస్తావించి సహజ న్యాయం అనే భావనను తెలియజేశారు. కొన్ని రాజ్యాంగ సవరణలను ఉదహరించారు. ప్రాథమిక హక్కులు రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమన్నారు. బ్యాంకుల జాతీయకరణ, భారత ఉదాంతం తదితర విషయాల్లో రాజ్యాంగ చట్టాలు, న్యాయనిపుణులు వ్యాఖ్యానించిన తీరుతెన్నులను ప్రస్తావించారు. గౌరవ అతిథి ప్రొఫెసర్‌ ఆర్‌.వెంకటరావు మాట్లాడుతూ, న్యాయవ్యవస్థ గమనాన్ని క్షుణ్ణంగా వివరించారు. రాజ్యాంగ నియంత్రణలో శాసన, కార్యనిర్వహాక, న్యాయవ్యవస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రొఫెసర్‌ ప్రసన్నకుమార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గ్రంథాలయం చైర్మన్‌ డాక్టర్‌ సూరపనేని విజరుకుమార్‌, గ్రంథాలయ కార్యదర్శి డిఎస్‌.వర్మ, న్యాయవాదులు, గ్రంథాలయ సిబ్బంది, సెంటర్‌ ఫర్‌ పాలసీ స్టడీస్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.