
ప్రజాశక్తి-భోగాపురం : పరిహారం సక్రమంగా మంజూరు చేయలేదని గూడెపువలస ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి చెందిన రెల్లిపేట గ్రామస్తులు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుకు దృష్టికి తీసుకువెళ్లారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గూడెపువలస సచివాలయ పరిధిలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి వెళ్లారు. విమానాశ్రయ భూములపై న్యాయస్థానానికి వెళ్లిన వారందరికీ ఎకరాకు రూ.85 లక్షలు ఇస్తామని చెప్పి, కేవలం ప్రభుత్వం ఇచ్చిన పరిహారం మాత్రమే అందజేశారని నిర్వాసితులు తెలిపారు. మిగిలిన సొమ్ము సుమారు రూ.2 కోట్లు విమానాశ్రయ నిర్మాణ సంస్థ ఇస్తుందని నాయకులు చెప్పి మూడేళ్లవుతున్నా ఇవ్వడం లేదని గూడెపువలస మాజీ ఎంపిటిసి ఇంటి పైడయ్య చెప్పారు. ఆ సొమ్ము ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. గ్రామాలు ఖాళీ చేసేటప్పుడు సామాన్లు రవాణా ఛార్జీలు రూ.50 వేలు ఇస్తామని, నేటికీ ఆ సొమ్ము ఇవ్వలేదని నిర్వాసితులు అన్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందించి జిల్లా జాయింట్ కలెక్టర్‌తో మాట్లాడి వారికి న్యాయం చేయాలని కోరారు. ఆర్‌అండ్‌ఆర్ కాలనీకి తమ డి-పట్టా భూములు తీసుకున్నప్పుడు విమానాశ్రయ భూములకు ఇచ్చే పరిహారమే ఇస్తామని చెప్పి నేటికీ మిగతా పరిహారం ఇవ్వలేదని రాజారావు అనే యువకుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లాడు. దీనిపై కూడా ఎమ్మెల్యే స్పందించి ఈ సమస్యను కూడా చూడాలని డిప్యూటీ తహశీల్దారు శ్రీనివాసరావుకు సూచించారు. అంతకుముందు గ్రామంలోని గడపగడపకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి, మాజీ జెడ్‌డ్‌పిటిసి ప్రభాకరరెడ్డి, ఎంపిడిఒ అప్పలనాయుడు, ఇఒపిఆర్‌డి సురేష్, నాయకులు కొల్లి రామ్మూర్తి, అప్పలరెడ్డి, పడాల శ్రీనివాసరావు, ఎ.పైడినాయుడు, దల్లి శ్రీనివాసరావు, కొండపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
సిమెంట్ రోడ్డు ప్రారంభం
భోగాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ప్రారంభించారు. మండల పరిషత్తు నిధుల నుంచి 10 లక్షల రూపాయలతో పాఠశాల నుంచి పంచాయతీ కార్యాలయం వరకు ఈ రహదారిని నిర్మించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, నాయకులు పడాల శ్రీనివాసరావు, కొమ్మూరు సుభాషణరావు, సుందర హరీష్, పడాల భాను, జెఇ చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో వాకింగ్ ట్రాక్‌తోపాటు చిన్నారులు ఆడుకునేందుకు పార్కు నిర్మించాలని యువకులు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. దీనిపై పరిశీలించాలని జెఇకి ఎమ్మెల్యే సూచించారు.