- రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం రూరల్: అచ్చమైన సినీ నటుడుగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును చదువుతున్నాడని, ఆ మాటలకు చప్పట్లు కొట్టిన వారంతా ఓట్లు వేయరన్న వాస్తవాన్ని ఆయన గ్రహించాలని రెవిన్యూశాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. శ్రీకాకుళం రూరల్ మండలం వప్పంగి, సానివాడ, నగర పాలక సంస్థ పరిధిలోని పెద్దపాడు 1, 2 సచివాలయాల పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమాల్లో శనివారం మాట్లాడారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారథులు వాలంటీర్లు అని, వారి పట్ల చంద్రబాబు అండ్ కో విషం జల్లు తున్నారన్నారు. వారి మాటలను ప్రజలు ఎంతమాత్రం విశ్వసించరన్నారు. మధ్యవర్తిత్వంలేని, అవినీతిలేని ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని, ఈ ప్రభుత్వానికి ప్రజలు మరో సారి అండగా నిలిచి జగన్మోహనరెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణ, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు వైసిపి నాయకులు అంబటి శ్రీనివాసరావు, ఎంపిపి అంబటి నిర్మల, ఎఎంసి చైర్మన్ ముకళ్ల తాత బాబు, చల్లా రవి కుమార్, అల్లు లక్ష్మి నారాయణ, పిఎసిఎస్ సభ్యులు గొండు కష్ణ, పెద్దిన ఉమా తదితరులు పాల్గొన్నారు.










