Aug 01,2021 06:24

    రేంద్ర మోడీ మలి దఫా పాలనలో దేశంలోని కీలక వ్యవస్థలన్నీ దీర్ఘకాలం పాటు ఎలా కల్లోలితమవుతున్నాయో గమనిస్తే ఆందోళన కలుగుతుంది. పాలన, శాసన, న్యాయ వ్యవస్థలతో పాటు నాలుగో స్తంభంగా చెప్పే మీడియానూ ఇది కమ్మేస్తున్నది. పౌర పాలనకు ఆవల వుండాల్సిన..ఇంతకాలం వుంటూ వచ్చిన.. సైనిక అర్థ సైనిక వ్యవస్థలను కూడా వదిలి పెట్టడం లేదు. మత, ఆధ్యాత్మిక వ్యవస్థలు సరేసరి. ఏ రంగంలోనూ సత్ఫలితాలు లేకపోగా సమస్యలే తాండవిస్తున్నాయి. వాటి పరిష్కారానికి ఉద్యమించిన వివిధ తరగతుల ప్రజలనూ ప్రతిపక్షాలనూ అణచి వేసేందుకు పోలీసులు వేధించేందుకు నిఘా యంత్రాంగం ప్రయోగించబడుతున్నది. దేశంలో అత్యున్నత వ్యవస్థ అయిన పార్లమెంటు నిర్వహణ ప్రహసనంగా మార్చివేయబడింది. రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాల స్థానం, విలువ, పరిధి కోతపడి పోతున్నాయి. విదేశాంగ విధానంలోనూ భారత దేశ గత వరవడికి భిన్నమైన విపరీత ధోరణులు వినాశకరంగా పరిణమిస్తున్నాయి. ఇందుకు ప్రతిగా మరోవైపున ప్రతిపక్షాల పోరాటం, సంప్రదింపులు, పార్లమెంటు స్తంభన వంటివీ చూస్తున్నాం.వర్తమాన భారత దృశ్యం ఇది.
 

                                                          పెగాసస్‌ ప్రకంపన- ఇతరులూ, మనం

    పార్లమెంటు సమావేశాలకు ఒక రోజు ముందు పెగాసస్‌ స్పైవేర్‌తో వందలమంది మొబైళ్లను అక్రమంగా ఆలకించారన్న ఘోరం బయిటకు వచ్చింది. మన దేశంలో 'వైర్‌'తో సహా ప్రపంచ వ్యాపితంగా పదిహేను దేశాల మీడియా సంస్థలు ఈ కథనాన్ని సాక్ష్యాధారాలతో సహా వెల్లడి చేశాయి. ఇజ్రాయిల్‌కు చెందిస స్పైవేర్‌ తయారీదారీ సంస్థ ఎన్‌ఎస్‌వో గ్రూపు చెప్పిన ప్రకారం దాన్ని ప్రభుత్వాలకే విక్రయిస్తారు. ఈ మాట మోడీ ప్రభుత్వమూ కాదనలేదు. అనధికారికంగా హ్యాకింగ్‌ కుదిరే పని కాదంటున్నది. మళ్లీ అదే నోటితో ఖండిస్తున్నది. దీనిపై సభాసంఘం ద్వారానూ, సుప్రీం కోర్టు ఆధ్వర్యంలోనూ దర్యాప్తు జరపాలని ప్రతిపక్షాలు, మీడియా కోరినా ప్రభుత్వం పెడచెవిని పెట్టి ఎదురుదాడి చేస్తున్నది. ఇది దేశ ప్రతిష్టకు భంగం కలిగించే కుట్ర అని ఆరోపిస్తున్నది. సంఘ పరివార్‌ మొత్తానికి ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. వాస్తవానికి ఈ కథనం వచ్చాక ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మోర్కాన్‌ తన ఫోన్‌ వినడంపై విస్తుపోయి విచారణ కోరాడు. అమెరికా వంటి దేశాలు ఇజ్రాయిల్‌ ను విచారణ జరపాల్సిందిగా పైపైనైనా ఒత్తిడి పెడుతున్నాయి. ఆ దేశం కూడా సమర్థించుకోలేక ఏదో పైపై విచారణలు, ఉత్తర్వులతో నాటకం ఆడుతున్నది. మోడీ సర్కారు తీరు అందుకు పూర్తి భిన్నంగా వుందంటే పెగాసస్‌ను దుర్వినియోగం చేసిన తీరే కారణం.
 

                                                                   సుప్రీంలోనే అమీతుమీ

    కర్ణాటక ప్రభుత్వం కూల్చివేతకు ముందు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య పి.ఎ ఫోన్‌ వింటారు. బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ ఫోన్‌ పట్టుకుంటారు. బిఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ కె.కె.శర్మ సంఘ పరివార్‌ సభకు హాజరైనా సరే నిజంగా విధేయుడో కాదో తేల్చుకోవడానికి హ్యాకింగ్‌ చేసి ఆ పైన బెంగాల్‌ ఎన్నికలకు పరిశీలకుడుగా పంపుతారు. దేశమంతటిపై నిఘా వేసే సిబిఐ అధినేతలు అలోక్‌వర్మ, రాకేశ్‌ ఆస్తానాలపై నిఘా వేస్తారు. సిజెఐ జస్టిస్‌ రమణ అభ్యంతరాల కారణంగా సిబిఐ అధినేతను చేయలేకపోయిన రాకేశ్‌ ఆస్తానా ను ఆ నిబంధనలకు భిన్నంగా ఇప్పుడు పొడగింపు ఇచ్చి ఢిల్లీ కమిషనర్‌గా డిఐజి హోదాగల పదవిలో పంపుతారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులపైనా నిఘా వేస్తారు. కేంద్ర మంత్రివర్గంలో ప్రమోషన్‌ ఇవ్వదలిచిన వారి విధేయతను పరీక్షించడానికి పెగాసస్‌ వాడతారు. జాతీయ మీడియాలో కీలక పాత్రధారులనూ అందులోనూ తమ కంటిలో నలుసులా వున్న జర్నలిస్టులను వేటాడటానికి నిఘా వేస్తారు. గతంలో ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే వంటివారు కేవలం ఫోన్‌ ట్యాపింగ్‌ వల్లనే రాజీనామా చేయవలసి వచ్చిన సందర్భాలకు ఇది పూర్తి విరుద్ధం. ఇవన్నీ ఉదహరించడం ఎందుకంటే అన్ని వ్యవస్థలనూ గుప్పిట్లో పెట్టుకోవడానికి ఎంత దారుణమైన కుట్రలు జరిగాయో తెలియడానికి. అందుకే పార్లమెంటు సమావేశాలు మొదలైన నాటి నుంచి ఇదే సమస్య స్తంభింపచేస్తున్నది. ఏదైనా చర్య తీసుకునే వరకూ వెనక్కు తగ్గే అవకాశం కూడా లేదు. ఇదే అదునుగా తీసుకుని కొన్ని బిల్లులను ఆమోదింపచేసుకున్నా దీనికి ముగింపు తెలియక కేంద్రం తల పట్టుకుంటున్నది. 12 ప్రతిపక్షాలు రాష్ట్రపతికి లేఖ రాశాయి. సిపిఎం ఎం.పి జాన్‌ బ్రిటాస్‌ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు కోసం పిటిషన్‌ వేశారు. ఎన్‌ రామ్‌, శశికుమార్‌లు కూడా కోర్టుకు వెళ్లగా వచ్చేవారం విచారణకు స్వీకరిస్తామని సిజెఐ జస్టిస్‌ రమణ ప్రకటించారు. ఈ విధంగా సభలో చర్చను దాటవేసినా సుప్రీంకోర్టులో మాత్రం అన్ని విషయాలు బయిటకు వస్తాయని ఆశించవచ్చు.ఈలోగా మరెన్ని కొత్త సంగతులు వెలుగు చూస్తాయో చెప్పలేము. గతంలో సోషల్‌ మీడియా నిర్వహణ సంస్థలైన వాట్సప్‌, ఫేస్‌బుక్‌ వంటివి డేటాను వినియోగించడం ద్వారా గోప్యతకు భంగం కలిగిస్తున్నాయనే ఫిర్యాదులు వచ్చినప్పుడు కేంద్రం వాటిపై కేసులు వేసింది.ఇప్పుడు తనే రహస్యంగా డేటా తెప్పించి దోషిగా బోనులో నిలబడింది.అటూ ఇటూ అడకత్తెరలో చిక్కింది దేశపౌరులే.
 

                                                           న్యాయ వ్యవస్థకూ సెగ, రాష్ట్రాలపై దాడి

    ఎ.పి కి సంబంధించిన చాలా అంశాల్లో కేంద్రం శూన్యహస్తం చూపింది. విశాఖ ఉక్కును వంద శాతం ప్రైవేటీకరిస్తానని హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ వేసింది. సహకార రంగంలో రాష్ట్రాల హక్కులను హరిస్తూ అమిత్‌షా కు ఆ శాఖను కట్టబెట్టిన ప్రధాని నిర్వాకం కూడా మరో సందర్భంలో కోర్టులో సవాలు చేయబడింది. కోర్టులు కూడా అనేక ఒత్తిళ్లకు గురయ్యాయి.హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో ఆలస్యం గురించి సుప్రీం అడిగితే కేంద్రం ఏకపక్షంగా జవాబిచ్చింది. జార్ఖండ్‌లో ధన్‌బాద్‌ జిల్లా అదనపు మెజిస్ట్రేట్‌ గనుల మాఫియా చేతిలో హత్యకు గురైన వార్త దేశాన్ని కలవరపర్చింది. పోలీసులు ఆ కేసులో సరిగ్గా స్పందించకపోవడం హైకోర్టు ఆగ్రహానికి కారణమైంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుని న్యాయమూర్తులకు రక్షణ గురించి గట్టిగా స్పందించింది. గతంలో జస్టిస్‌ లోదా వంటి వారి మృతిపై నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా ముందు మాట్లాడితే స్పందనలేని పరిస్థితికి ఇది భిన్నం. పశ్చిమ బెంగాల్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అక్కడి బార్‌కౌన్సిల్‌ బహిష్కరిస్తున్నది. ఎ.పి లోనూ ప్రభుత్వానికి, ప్రధాన ప్రతిపక్షానికి మధ్యన రాజకీయ వివాదాలకు హైకోర్టు కేంద్రమవుతున్నది. న్యాయమూర్తులపై అసభ్య పోస్టులు పెట్టినందుకు ఎ.పి లో సిబిఐ ఇప్పటికి ముగ్గురిని అరెస్టు చేసింది. మహారాష్ట్రలో మాజీ పోలీసు కమిషనర్‌, మాజీ హోంమంత్రితో సహా చాలా మందిపై కేసులు నడుస్తున్నాయి. పాలనా నిర్వహణ అంశాలలో మరీ ఎక్కువగా జోక్యం చేసుకోవడంలో సంయమనం అవసరమనే భావన కూడా ఇటీవల సుప్రీం కోర్టు నుంచే వచ్చింది.
     ఈ పూర్వరంగంలో మత సమస్యలు రగిలించే రాజకీయం ముదురుతున్నది. ఎ.పి మత మార్పిళ్ల మయమై పోయిందని, ఆలయాలకు రక్షణ లేదని బిజెపి ఆలయాల యాత్ర ప్రారంభించింది. 1766-99 మధ్యనే బ్రిటిష్‌ వారిపై పోరాడి ప్రాణాలర్పించిన టిప్పుసుల్తాన్‌ విగ్రహ స్థాపనను కూడా వివాదంగా మార్చింది. యు.పి ఎన్నికలు దగ్గరపడే కొద్ది అయోధ్య రామాలయం ఎజెండాగా మారిపోతుంటే బిఎస్‌పి కూడా మేమే ముందు కట్టిస్తామంటున్నది. సున్నితమైన ఉమ్మడి సివిల్‌ కోడ్‌ వంటి అంశం కూడా తీసుకోవాలనే ఉద్దేశాన్ని ఒక హైకోర్టు వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల జల వివాదాలు అంతిమంగా రెండు రాష్ట్రాల నదులపై పెత్తనం కేంద్రం చేతిలో పెట్టాయి. అసోం లోని బిజెపి ప్రభుత్వం మిజోరాంలో వారి అనుకూల ప్రభుత్వం రాష్ట్రాల సరిహద్దుల గురించి దేశాలను మించి పోట్లాడుకుంటున్నాయి. పెగాసస్‌ ఉదంతంపై మమతా ప్రభుత్వం సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ లోకూర్‌ ఆధ్వర్యంలో తనే విచారణ కమిటీని నియమించి కేంద్రాన్ని సవాలు చేశారు.
 

                                                              ఆ ఎన్నికలే తొలి సూచనా ?

   రెండోసారి గెలిచిన మోడీకి తిరుగు లేదనే వాతావరణం చెదిరిపోతుంటే పార్లమెంటుకు సమాంతరంగా జంతర్‌ మంతర్‌ దగ్గర రైతు పార్లమెంటు జరిగింది. ముఖ్యమంత్రులను మార్చేయడం ద్వారా రాష్ట్రాలలో పట్టు నిల్పుకోవడానికి బిజెపి తంటాలు పడుతున్నది. గత నెలలో ఉత్తరాఖండ్‌లో వరుసగా మార్చింది గాక ఈ మధ్య కర్ణాటకలో యెడియూరప్పను దింపి బసవరాజు బొమ్మై ని ప్రతిష్టించినా తగాదాలు తగ్గుతున్నది లేదు. ప్రతిపక్షాల చీలికే తమకు వరప్రసాదంగా వున్న స్థితి మారి పార్లమెంటును ఒక్కుమ్మడిగా స్తంభింపచేయడం మరో వైపు చూస్తున్నాం. వామపక్షేతర పార్టీలను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అదేపనిగా సమావేశపరుస్తున్నారు. బెంగాల్‌లో మూడోసారి గెలిచిన మమతా బెనర్జీ ప్రధాని పదవిపై ఆశపడుతున్నారనే వార్తల మధ్య ఆమె తరపునే ఆయన పని చేస్తున్నారనే భావన చాలా మందిలో వుంది. అనేకమంది ప్రాంతీయ పార్టీల నేతలు బిజెపి కి అనుకూలంగా వున్న పరిస్థితిలో సీనియర్‌ ముఖ్యమంత్రిగా ఆమె ఆశ పెంచుకుటున్నారు. గాంధీ కుటుంబ ముఖ్యులతోనే ప్రశాంత్‌ కిశోర్‌ చర్చలు జరిపారు. పి.కె కాంగ్రెెస్‌లో చేరతారని, కాయకల్ప చికిత్సకు ఫార్ములా ఇస్తారని కథనాలు వస్తుంటే వారు అంతర్గత ఆలోచన జరుపుతున్నట్టు చెబుతున్నారు. ఏమైనా ఈ ప్రతిపక్ష ఐక్యత అంత తేలిగ్గా జరిగేది కాదని కాంగ్రెస్‌ ఎలా కోలుకోవాలో తాను చెప్పలేనని ప్రశాంత్‌ కిశోర్‌ బిబిసి కి చెప్పారు. కాకుంటే మోడీకి ప్రత్యామ్నాయం లేదనే అభిప్రాయం మాత్రం సరైంది కాదని, దక్షిణ తూర్పు భారతాల్లో బిజెపి కి వచ్చిన స్థానాలు చాలా తక్కువని ఆయన వివరణ. విధానపరమైన అంశాలు, రాజకీయ స్పష్టత లేని ఈ సంప్రదింపులతో పెద్దగా ఒరిగేది వుండదని గతంలో చాలాసార్లు వెల్లడైంది. ఉత్తర భారతంలో యు.పి లో ఎస్‌.పి, బిఎస్‌పి లు తాము కలవడానికి గాని, కాంగ్రెస్‌ను కలుపుకోవడానికి గాని ఇప్పటికీ సిద్ధంగా లేవు. 2022 మార్చి-మే మధ్య గడువు ముగిసే యు.పి, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా తదితర రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. యు.పి బిజెపి కి మనుగడ కోసం పోరాటమే అవుతుంది. ఈ ఎన్నికల తర్వాతనే దేశ రాజకీయ గమనం సూచనప్రాయంగా తెలుస్తుంది.

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి