Sep 12,2023 23:40

ప్రజాశక్తి - మార్టూరు రూరల్
టిడిపి అధినేత చంద్రబాబుపై ఎలాగైనా అవినీతి మరక వేసి జైలుకి పంపాలనే  దుష్ట పన్నాగంతో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌లో స్కాం జరిగిందని సీఎం జగన్ నేతృత్వంలో సిఐడి అధికారులు తప్పుడు కేసులు బనాయించారని టిడిపి బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. జగన్‌పై ప్రజలలో వ్యతిరేకత రావడంతో ఓటమి తప్పదన్న భయంతోనే చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించారని విమర్శించారు. 38 కేసుల్లో జగన్ ముద్దాయిగా, అనేక కేసుల్లో ఏ1గా ఉన్నారని గుర్తు చేశారు. జగన్‌కు సంబంధించి ఈడీ, సీబీఐ రూ.5వేల కోట్లు జప్తు చేసిందని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో ఎక్కడా అవినీతి జరగలేదని అన్నారు. అసలు ఎలాంటి అవినీతికి ఆస్కారం లేని స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో చంద్రబాబు తప్పు చేశారనడం జగన్ అల్లిన కట్టుకథే అన్నారు. 10ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్న వ్యక్తి తనకు అంటిన బురదను పక్క వారికి అంటించే ప్రయత్నం చేస్తున్నాడంటూ మండిపడ్డారు. జీ-20గురించి ప్రపంచం మాట్లాడుతుంటే, ఏపీలో మాత్రం జగన్ చేసిన 420పనుల గురించి మాట్లాడే పరిస్థితి వచ్చిందన్నారు. చంద్రబాబు అరెస్టుతో టిడిపి క్యాడర్‌ని మానసికంగా ఒత్తిడికి గురిచేసి రాష్ట్రవ్యాప్తంగా ఫారం 7ద్వారా టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు వైసిపి నాయకులు కుట్రకు తెర లేపారన్నారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారని అన్నారు. అధినేత నుండి గ్రామస్థాయి వరకు అందరినీ వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. జగన్‌కుట్రలను టిడిపి కార్యకర్తలు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని కోరారు.