May 26,2023 23:53

మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

ప్రజాశక్తి- పాడేరు: రైతులకు సకాలంలో విత్తనాలు పంపిణీకి సంసిద్ధం కావాలని జిల్లా కలక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆదేశించారు. శుక్రవారం కలక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో కలక్టర్‌ అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలక్టర్‌ మాట్లాడుతూ, కమ్యునిటీ హైరింగ్‌ కేంద్రాల ద్వారా జూన్‌ ఒకటిన రూ. 75 లక్షల విలువగల వ్యవసాయ యంత్రపరికరాలు పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ కింద పనులు లేని గ్రామాలు ఉండకూడదని, జిల్లాలో 567 గ్రామాలలో పనులకు సంబంధించిన సెల్ఫ్‌ ఏర్పాటు చేసి పనులు మంజూరు చేయించాలన్నారు. మరో 30 లక్షల పని దినాలు కల్పించాలని, సగటు వేతనం పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులు రైతులకు అండగా ఉండాలని జిల్లా కలక్టర్‌ ఆదేశించారు. వీరి పని తీరు బాగా లేదని, క్షేత్ర స్థాయిలో పర్యటించినప్పటికీ కార్యాలయంలో రైతులకు కూడా అందుబాటులో ఉండాలన్నారు. అనేక సమస్యలపై సందేహ నివృతి కోసం వచ్చే రైతులకు అవగాహాన కలిగే విధంగా వారితో మాట్లాడాలని ఆదేశించారు. గ్రామ సహాయకులు హాజరును వేసి ఫోటోలు జిల్లా వ్యవసాయాదికారికి పంపాలని, జిల్లా వ్యవసాయాదికారి ప్రతి రోజు వాటిని పిడీయఫ్‌ రూపంలో తనకు పంపాలని కలక్టర్‌ ఆదేశించారు. గ్రామ సహాయకుల సేవలు అందించటంలో నిర్లక్ష్యం వహిస్తే సర్వీస్‌ నుండి తొలగించడానికి కూడా వెనుకాడబోనని హెచ్చరించారు.
శాశన సభ్యురాలు కే.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, మండలాల వారీగా రైతులకు బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించటంలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కాఫీ మొక్కలను నిజమైన లబ్దిదారులకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని, సుమారు 4500 ఎకరాలలో గంజా పంట నుండి విముక్తి పొందిన రైతులకు ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహించాలని కోరారు.
జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ సరస్వతి మాట్లాడుతూ గతంలో ఐటిడిఎ ద్వారా పవర్‌ వీడర్స్‌ కు డబ్బులు చెల్లించినప్పటికీ యంత్రాలు కొంతమందికి రాలేదని కలక్టర్‌ దృష్టికి తీసుకు రాగా కలక్టర్‌ స్పందిస్తూ ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారి వి. అభిషేక్‌ ను సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు రైతులకు సబ్సిడీ విత్తనాలను జిల్లా కలక్టర్‌, శాసన సభ్యులు, డి.ఎ.ఎ.సి చైర్మన్‌ చేతుల మీదుగా పంపిణీ చేసారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అందుబాటులో నాలుగు రకాల వరి విత్తనాలు ఉన్నాయని మరో ఏడూ రకాల విత్తనాలు రానున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారి వి. అభిషేక్‌, జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులు బి.ఎస్‌.ఎస్‌. నందు, పి రమేష్‌, డ్వామా పిడి రమేష్‌ రామన్‌, మార్కెటింగ్‌ ఎడి రాకేశ్‌, మండల వ్యవసాయ, ఉద్యాన అధికారులు పాల్గొన్నారు.