ప్రజాశక్తి - ఏలూరు
స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్నంగా పరిశీలించి నిర్ధేశించిన గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. సోమనవారం కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లాస్థాయి జగనన్నకు చెబుదాం స్పందన అర్జీల స్వీకరణ పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జెసి బి.లావణ్యవేణి, డిఆర్‌ఒ ఎవిఎన్‌ఎస్.మూర్తి, డిఆర్‌డిఎ పీడీ విజయరాజు, జెడ్‌పి సిఇఒ రవికుమార్, డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణ, ఆర్‌డిఒ కె.పెంచల కిషోర్, వ్యవసాయశాఖ జెడి రామకృష్ణతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ స్పందనలో ఆయాశాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గృహమంజూరు, ఉపాధి అవకాశాలు, రెవెన్యూ సేవలు, సర్వే, భూ తగాదాలు, పింఛన్లు తదితర అంశాలపై అర్జీలు స్వీకరించారు. జగనన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమంలో 473 అర్జీలు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆయా శాఖాధికారులు, సిబ్బందితో జెండా ఆవిష్కరణ చేయాలని సూచించారు. స్పందనలో వచ్చిన అర్జీలను రీ ఓపెనింగ్ లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించి అర్జీలను పరిష్కరించి అర్జీదారులకు ఎండార్స్‌మెంట్ ఇవ్వాలన్నారు. అర్జీల పరిశీలనలో భాగంగా నియమించిన జిల్లా ఆడిట్ అధికారులు అర్జీల పరిశీలనలో ప్రత్యేకమైన శ్రద్ధ కనబరచాలని అన్నారు.










