ప్రజాశక్తి - ఏలూరు
స్పందన అర్జీదారుల సమస్యల పట్ల సకాలంలో స్పందించి నిర్ణీత గడువులోగా సంతృప్తికర స్థాయిలో పరిష్కారం చూపాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశిం చారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమి సమావేశ మందిరంలో నిర్వహించిన సమస్యల పరిష్కార వేదిక జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ ప్రసన్నవెంకటేష్, జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి, ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ సూర్యనారాయణరెడ్డి, జెడ్‌పి సిఇఒ కె.రవికుమార్, ఆర్‌డిఒ ఎస్‌కె.ఖాజావలి, జిఎస్‌డబ్ల్యూఎస్ నోడల్ అధికారి రమణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జివివి.సత్యనారాయణమూర్తి, అర్జీదారుల నుంచి 94 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్ధాయిలో క్షుణ్నంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. పెండింగ్, బియాండ్ ఎస్‌ఎల్‌ఎ, రీఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు.
జెసి మాట్లాడుతూ రీసర్వే మూడో విడత, స్టోన్ ప్లాంటేషన్, ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అంశాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అసైన్డ్ ల్యాండ్ ఇనామ్ భూములకు సంబంధించిన అంశాలను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు.
అందిన అర్జీలలో కొన్ని..
పెదవేగి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన ఎం.నారాయణరావు తమ జాయింట్ భూమికి ఒకవాటాకు పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పించాలని కోరుతూ అర్జీ అందజేశారు. బుట్టాయగూడెం మండలం జైనవారిగూడేనికి చెందిన కె.కృష్ణకుమారి వినతిని అందిస్తూ తమతల్లి ఇచ్చిన పసుపుకుంకుమ భూమిని ఇతరులు ఆక్రమించుకుని సాగుచేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకుని తన భూమి తనకు ఇప్పించాలని కోరారు. ఉంగుటూరు మండలం తాళ్లపురం గ్రామానికి చెందిన కె.శ్రీను తమ భూమిని సర్వే చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు. మండవల్లి మండలం లోకమూడి గ్రామానికి చెందిన కుసుమకుమారి తమ కుమారుడి డాక్టర్ చదువుకు ఇంటిని తాకట్టుపెట్టుటకు రిజిస్ట్రేషన్ చేయడానికి సంబంధిత అధికారులు నిరాకరించారని, తగిన పరిష్కారం చూపాలని అర్జీ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.










