ప్రజాశక్తి - ఆరిలోవ : రహదారి ప్రమాదాలు, గుండె సమస్యలు సంభవించినప్పుడు సకాలంలో స్పందించి స్వల్ప వ్యవధిలో ఆసుపత్రికి తరలిస్తే విలువైన ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువ ఉంటుందని నగర పోలీసు కమిషనర్ సిహెచ్.శ్రీకాంత్ అన్నారు. ఆరిలోవ హెల్త్‌సిటీలోని అపోలో ఆసుపత్రిలో మంగళవారం రహదారి భద్రత అవగాహన కార్యక్రమానికి శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే 1066 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఈ విషయంలో ఎటువంటి అపోహలకు లోను కాకుండా అంబులెన్స్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇస్తే పోలీసులు, కోర్టులు చుట్టూ తిరగాలనే అపోహలు పెట్టుకోవద్దన్నారు. అపోలో సీనియర్ కార్డియాలజిస్ట్ దివ్య కుమార్ బారువా మాట్లాడుతూ, గుండె పోటుకు గురైన వ్యక్తికి ఎటువంటి ప్రాథమిక చికిత్స చేయాలి, తక్కువ సమయంలో అందుబాటులో అన్ని సౌకర్యాలు ఉన్న ఆసుపత్రికి చేర్చే విషయంపై అవగాహన కల్పించారు. సీనియర్ కార్డియాలజిస్ట్ నందకుమార్ పాణిగ్రహి మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గోల్డెన్ అవర్‌ను ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన కల్పించారు. డాక్టర్ మధుసూధనరావు, డాక్టర్ రవిరాజ్ మాట్లాడుతూ, రహదారి ప్రమాదాలు, గుండె వ్యాధులపై ఎలా స్పందించాలో వివరించారు. అనంతరం ఆరిలోవ అపోలో సిబ్బంది, యువకులు అపోలో ఆసుపత్రి నుంచి చినగదిలి మీదుగా స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్ వరకు రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తూ బైకు ర్యాలీ నిర్వహించారు.










