
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరికాదని, నెలవారీ 1వ తేదీన క్రమం తప్పకుండా జీతాలు కూడా చెల్లించడం లేదని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంధ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం యూటిఎఫ్ జిల్లా కార్యాలయంలో సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి యుటిఎప్ జిల్లా అధ్యక్షులు పొందూరు అప్పారావు అధ్యక్షత వహించారు. సమావేశంలో రవీంద్ర మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం గడిచిన కొన్ని నెలల నుంచి జీతాలు ఎప్పుడిస్తారో తెలియని అయోమయ పరిస్థితిని కల్పించారని విమర్శించా రు. నవంబరు నెల జీతాలు ఇంతవరకు ఉపాధ్యాయ, ఉద్యోగులకు చెల్లించలేదన్నారు. మరోవైపు ప్రభుత్వ విద్యారం గాన్ని నిర్వీర్యం చేస్తూ కొత్త విధానాలను తీసుకొస్తున్నారని, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునేం దుకు ఉపాధ్యాయు లందరూ మరింత నిబద్ధతతో పనిచేయాలన్నారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పర్యటనలు విద్యా రంగాన్ని నష్టపరిచే విధంగా ఉన్నాయని, ఆయన వైఖరిలో మార్పు రావాలని డిమాండ్ చేశారు. ఈ ఏడాది జిల్లా కౌన్సిల్ సమావేశాలు డిసెంబర్ 3న కోటబొమ్మాళిలో నిర్వహించడం జరుగుతుందని, ఉపాధ్యాయులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలని కోరారు. సమావేశంలో కిషోర్ కుమార్, జిల్లా గౌరవ అధ్యక్షులు వైకుంఠరావు, సహాధ్యక్షులు ఎల్.బాబూ రావు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఉమాశంకర్, అర్.దమయంతి, జిల్లా కార్యదర్శి దాలయ్య, అన్నాజీరావు పాల్గొన్నారు.