ప్రజాశక్తి - ఒంగోలు కలెక్టరేట్ : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సకాలంలో తాము పనిచేసే ప్రదేశాలలో హాజరు వేయాలని లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ హాజరు, నాడు-నేడు, ఫ్యామిలీ డాక్టర్ క్యాంపు , డాక్టర్ వైఎస్‌ఆర్ విలేజి క్లినిక్స్, 49వ ఫీవర్ సర్వే , అనీమియా ముక్తిభారత్, డైట్ సర్వే , ప్రమాదకర గర్భిణుల గుర్తింపు, బర్త్ ప్లానింగ్ లాంటి జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే సిబ్బంది అందరూ సకాలంలో ప్రభుత్వం గుర్తించిన ప్రదేశాలలో మాత్రమే హాజరు వేయాలన్నారు. లేకపోతే వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సంబంధిత ప్రోగ్రామ్ అధికారులు తమ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, సెక్రటేరియట్‌లో ముఖ హాజరును పర్యవేక్షించాలని ఆదే శించారు. ప్రసుతం నిర్మాణంలో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,సామాజిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల భవనాలను సకాలంలో పూర్తిచేసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు అప్పగించాలని ఎపిఎంహెచ్‌ఐడిసి ఎస్‌ఇని కలెక్టర్ ఆదేశించారు. డాక్టర్ వైఎస్‌ఆర్ విలేజి క్లినిక్స్, గహసందర్శనలలో గ్రామ వాలంటీర్లు సర్వే చేసేటప్పుడు వాస్తవంగా రుగ్మతలతో బాధపడుతున్నప్పుడు మాత్రమే వాలంటరీ యాప్ నందు నమోదు చేయాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కు సంబంధించి ఏ గ్రామంలో కార్యక్రము నిర్వహిస్తారో అక్కడ ముందు రోజు ఆషా, వాలంటీర్ సంబంధిత గ్రామ సర్పంచి దండోరా ద్వారా ప్రజలకు తెలియపరచి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. గర్భిణులను త్వరగా గుర్తించి వారిని 12 వారాల లోపు రిజిస్టర్ చేసి టిటి మొదటి మోతాదు, ఐరన్ ఫోలిక్ మాత్రలు. పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. హైరిస్క్ గర్భిణులను ముందస్తుగా గుర్తించి బర్త్ ప్లాన్ ప్రకారం సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. వారికీ రవాణా ఖర్చులను సంబంధిత డిడిఒల ద్వారా అందించాలన్నారు. ప్రతి పిహెచ్‌సి పరిధిలో సాధారణ ప్రసవాలు నిర్వహించాలని అది ప్రతి వైద్యాధికారి, సిబ్బంది బాధ్యతని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డిఎం,హెచ్‌ఒ డాక్టర్ ఎస్.రాజ్యలక్ష్మి, రిమ్స్ సూపరిండెంట్ ఎం.భగవాన్ నాయక్, డిసిహెచ్‌ఎన్ డాక్టర్ సత్యనారాయణ మూర్తి, ఎఫ్‌పిసి నోడల్ అధికారి మాధవీలత , ప్రోగ్రాం అధికారులు,డేటా మేనేజర్ ప్రభాకర్ రెడ్డి, మాస్ మీడియా అధికారి శ్రీనివాసరావు, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










