Aug 03,2021 17:46

అమరావత : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయన్నది అందరికీ తెలిసిన విషయమేనని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేస్తుందని భాజపా నేతలు చేసిన విమర్శలపై ఆయన మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు ఆ పార్టీ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అప్పులు చేయడం లేదా? బిజెపి వాళ్లు అప్పులు చేయడం ఒప్పు.. మేము చేస్తే తప్పా? అని వారిని ప్రశ్నించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది ఒక్క ఏపీ రాష్ట్రమే కాదు.. కేంద్రం సహా అన్ని రాష్ట్రాలూ సంక్షోభంలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు మాత్రమే కాదు.. గత తెలుగుదేశం ప్రభుత్వం మూడు లక్షల కోట్ల అప్పులు మిగిల్చిందని.. దీనికితోడు వరుసగా తలెత్తుతున్న కోవిడ్‌ సంక్షోభంతో.. రాష్ట్రం ఆర్థికంగా మరిన్ని సమస్యలనెదుర్కొంటోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం..ఉద్యోగులకు తెలుసునని.. అందుకే వారు ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తెచ్చిన ప్రతి పైసాను సద్వినియోగం చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.