Jul 16,2023 01:49
సజ్జా చంద్రమౌళి విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న డాక్టర్‌ సజ్జా హేమలత తదితరులు

ప్రజాశక్తి-చీరాల: చేనేత మరియు రైతాంగ సమస్యలపై శాసనసభలో అనేకసార్లు ప్రస్తావిస్తూ వారి సమస్యలకు అహర్నిశలు కృషి చేసిన మాజీ శాసనసభ్యులు సజ్జా చంద్రమౌళి సేవలు అందరికీ ఆదర్శనీయమని టిడిపి సీనియర్‌ మహిళ నాయకురాలు మరియు పొన్నూరు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ డాక్టర్‌ సజ్జా హేమలత అన్నారు. శనివారం దివంగత సజ్జ చంద్రమౌళి జయంతి సందర్భంగా స్థానిక గడియార స్తంభం సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు డాక్టర్‌ సజ్జా హేమలత ఆధ్వర్యంలో పూలమాలలు వేసి టిడిపి నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేతలు అధికంగా ఉన్న చీరాల నియోజకవర్గంలో వారి సమస్యలపై ఆనాడు శాసనసభ్యులుగా ఉన్న ప్రగడ కోటయ్య, సజ్జా చంద్రమౌళి అనేకసార్లు చేనేతల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని అన్నారు. తన మామయ్య సజ్జా చంద్రమౌళి ఆదర్శ భావాలతో ఆ కుటుంబం నుంచి తాను చీరాల నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ అభివృద్ధికి, నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని, అందుకు టిడిపి నాయకులు కార్యకర్తలు అందరూ తమవంతు పూర్తి సహకారాన్ని అందించాలని ఆమె కోరారు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసేందుకు టిడిపి కార్యకర్తలు అందరూ కృషి చేస్తూ పార్టీ బలోపేతానికి అందరూ సహకరించాలని ఆమె కోరారు. ఆమె వెంట టిడిపి నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త సజ్జా వెంకటేశ్వర్లు, దామర్ల శ్రీకృష్ణ పలువురు చేనేత నాయకులు పాల్గొన్నారు.