Feb 28,2023 23:56
మాట్లాడుతున్న ఎంపిపి చింతల శ్రీకృష్ణయ్య

ప్రజాశక్తి-నగరం: ఈ నాలుగేళ్ల పాటు పరిపాలనను సజావుగా సాగించినట్లు ఎంపిపి చింతల శ్రీకృష్ణయ్య పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. పార్టీలకు, కులమతాలకు అతీతంగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు సహాయ సహకారాలతో మండలంలో ప్రతి పేదవాడికి ఏ పని అడిగినా తమవంతు బాధ్యతగా చేస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాలు ముందుగానే తమపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని, మండలంలోని ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయ పరుచుకుని బురదజల్లే ప్రయత్నం తిప్పి కొట్టాలని అన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో ప్రజలందరూ మెచ్చుకునే విధంగా వాలంటీర్‌ వ్యవస్థ గ్రామ సచివాలయ వ్యవస్థ నెలకొల్పి ప్రజలకు పరిపాలన సౌలభ్యం అందుబాటులోకి తెచ్చారన్నారు. మాండూస్‌ తుపాన్‌ ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారంగా మండలంలోని 5,516 మంది రైతులకు రూ.3 కోట్ల 63 లక్షల 34వేల 954లను ఈరోజు రైతుల ఖాతాల్లో జమ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహశీల్దారు ఎం శ్రీనివాసరావు, జెడ్పిటిసి సభ్యురాలు మాన్యం నాగమణి, ఎంపీడీవో రాధా రమణ, వ్యవసాయ అధికారి రమేష్‌ బాబు మరియు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.