Apr 04,2023 00:43
పరీక్షా కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: బాపట్లలో 10వ తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం బాపట్ల మున్సిపల్‌ హైస్కూలులో జరుగుతున్న 10వ తరగతి పరీక్షలను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఒత్తిడికి లేకుండా పరీక్షలు రాయాలని చెప్పారు. పరీక్షలకు హాజరైన విద్యార్థుల ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన మెడికల్‌ క్యాంపును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పివిజె రామారావు, బాపట్ల డిఎస్‌పి శ్రీనివాసరావు, రెవెన్యూ డివిజనల్‌ అధికారి రవీంద్ర, మున్సిపల్‌ కమిషనర్‌ భాను ప్రతాప్‌, తహశీల్దార్‌ కవిత తదితరులు పాల్గొన్నారు.
చీరాల: పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా ఎస్పీ వకూల్‌ జిందాల్‌ పదో తరగతి పరీక్షలు రాస్తున్న పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. సోమవారం ప్రారంభమయిన పది పరీక్ష కేంద్రాలలో చీరాల మండల పరిధిలో మొత్తం 10 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని కస్తూర్బాగాంధీ, బాలికోన్నత పాఠశాల, ఎన్‌ఆర్‌ పీఎం-ఏ, ఏఆర్‌ఎం, శ్రీచైతన్య, ఎన్‌ఆర్పిఎం-, భాష్యం, శ్రీగౌతమి, ఈపురుపాలెం జిల్లా పరిషత్‌ బాలుర, బాలికల పాఠశాల, జాండ్రపేట బీవీ, బీఎన్‌ ఉన్నత పాఠశాలలో మొదటి రోజు తెలుగు పరీక్ష జరిగాయి. పట్టణంలోని ఎన్‌ఆర్పీఎం, భాష్యం, శ్రీ చైతన్య పాఠశాలలను జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ పరిశీలించారు. ఆయా పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు గురించి అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో క్షుణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎవరైనా మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉందన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఉన్న జిరాక్స్‌ సెంటర్లు, నెట్‌ సెంటర్లను మూసివేయించినట్లు తెలిపారు. ఈ నెల 18వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ చెప్పారు. ఎస్పీ వెంట డీఎస్పీ పి శ్రీకాంత్‌, ఒకటో పట్టణ సీఐ మల్లిఖార్జునరావు, ఎస్‌ఐలు సిబ్బంది ఉన్నారు. అదేవిధంగా ఆర్డీవో సరోజిని, పట్టణంలోని పలు పాఠశాలలను పరిశీలించారు. మొదటిరోజు కావటంతో 8.30 కల్లా విద్యార్థులను తమ తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాలకు తీసుకొచ్చారు. వారికి సలహాలు, సూచనలు ఇచ్చి ఒత్తిడికి గురికాకుండా చక్కగా పరిక్ష రాయాలని సూచించారు.
నిజాంపట్నం: మండలంలో ఐదు పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని నిజాంపట్నం జడ్పీహెచ్‌ఎస్‌లో 251కి 251మంది, నిజాంపట్నం బీసీ గురుకుల పాఠశాలలో 96కు 95 మంది పరీక్షలు రాయగా ఒకరు గైర్హాజరయ్యారు. కూచినపూడి ఎస్పీఆర్‌ఆర్‌ హైస్కూల్‌లో 51కి 51 మంది, అడవులదీవి జడ్పీహెచ్‌ఎస్‌లో 172కి 170 మంది పరీక్షలు రాయగా ఇద్దరు గైర్హాజరయ్యారు. ముత్తుపల్లి జడ్పీహెచ్‌ఎస్‌లో 117కు 111 మంది పరీక్షలు రాయగా 6 గురు గైర్హాజరయ్యారు. మొత్తం 687కి 678 మంది పరీక్షలు రాయగా 9 మంది గైర్హాజరయ్యారని ఎంఈఓ కె హరిబాబు తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిజాంపట్నం ఎస్‌ఐ ఎస్‌ రమేష్‌ పోలీసు సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించారు. అలాగే పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య సేవలను ఏర్పాటు చేశారు. మండలంలో పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను ఎంపీడీవో ఎన్‌ నాగలక్ష్మి సందర్శించి పర్యవేక్షించారు.