ప్రజాశక్తి-కాకినాడ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న జలవనరుల సమర్థ వినియోగంతో ఖరీఫ్ సాగు సజావుగా పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాల్లో జిల్లా సాగునీటి సలహా మండలి, వ్యవసాయ సలహా మండలి సంయుక్త సమావేశం జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఎదురైన తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో జిల్లాలోని మెట్ట ప్రాంత పంటలకు నీటి ఎద్దడిని నివారించేందుకు చేపట్టవలసిన అత్యవసర చర్యలు, ప్రత్యామ్నాయ పంటల కార్యాచరణ అంశాలను సమావేశంలో సలహా మండలి సమీక్షించింది. ఈ సమావేశంలో తొలుత జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.విజరు కుమార్ జిల్లాలో ఖరీఫ్ సాగు, పంటల పరిస్థితిని వివరిస్తూ జిల్లాలో ఈ సంవత్సరం జూన్ 1వ తేదీ నాటికే సాగునీరు విడుదల చేసినప్పటికీ, ప్రతికూలమైన వేసవి అధిక ఉష్ణోగ్రతలు జూలై 18 వ తేదీ వరకూ కొనసాగినందున, రైతులు జూలై మూడో వారం వరకూ ఖరీఫీ నారుమళ్లు వేయలేక పోయారని, ఈ కారణంగా జిల్లాలో ఖరీఫ్ సాగు జాప్యమైందన్నారు. ఈ యేడాది వర్షపాతం సాధారణ స్థాయి కంటే తక్కవగా నమోదైన కారణంగా వర్షాధారంగా మెట్ట ప్రాంత మండలాల్లో పంటల సాగు ఆలస్యమైందని, ఇంకా 460 ఎకరాల విస్తీర్ణంలో నాట్లు పడవలసి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు నేరుగా నాటే విధానంలో నీటి ఎద్దడిని తట్టుకునే స్వల్పకాలిక వంగడాలను సాగు చేయాలని రైతులకు సూచించామని, ప్రత్యామ్నాయ పంటలుగా పెసలు, మినుము, రాగులు సాగు చేసేందుకు అవసరమైన విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకూ 91 శాతం మేర నాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఇ జి.శ్రీనివాస్ వివరించారు. జి.బుల్లిరాజు, బొండా సూర్యనారాయణ, వై.అనంతలక్ష్మి, జి.వీర మోహనరావు, కె.చంద్రశేఖర్, కె.సత్యన్నారాయణ, ఎస్.ఎల్.వి.సత్యన్నారాయణ, ఎన్.సాంబమూర్తి, ఎస్‌ఇ కె.ఏసుబాబు, ఇఇలు కె.ఏడుకొండలు, డి.రామగోపాల్, అధికారులు పాల్గొన్నారు.










