Mar 16,2023 00:00

నక్కపల్లిలో పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు


ప్రజాశక్తి-యంత్రాంగం:
దేవరాపల్లి:దేవరాపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బుధవారం ప్రారంభమైన ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలకు జనరల్‌ విద్యార్థులు 201 మంది, ఒకేషనల్‌ 77 మంది, మొత్తం 278 మంది విద్యార్థులకు గాను 259 మంది హాజరుకాగా, 19 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు చీఫ్‌ సూపరిండెంట్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ యువిఎన్‌.వర్మ తెలిపారు. 15 గదుల్లో సీసీ కెమెరాల మధ్య పరీక్షలు జరిగాయి. పెందుర్తి నుంచి మతిస్థిమితం లేని (ఇన్నోసెంట్‌) షేక్‌ సుభాష్‌ అనే విద్యార్థి తల్లి సహాయంతో పరీక్ష రాయడానికి హాజరయ్యాడు. డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్‌గా కె.శ్రీనివాసరావు వ్యవహరించారు. ఎస్సై డి నాగేంద్ర ఆధ్వర్యాన గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
అచ్యుతాపురం : స్థానిక ప్రశాంతి పాలిటెక్నిక్‌ కళాశాలలో బుధవారం జరిగిన ఇంటర్‌ పరీక్షలకు 28 మంది విద్యార్థులు గైరాజరయ్యారు. ఇక్కడ పరీక్ష కేంద్రంలో 314 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 286 మంది హాజరయ్యారు. గేటు వేసిన అనంతరం ఒక విద్యార్థి రాగా, పరీక్షల నిర్వహణ అధికారి ఆ విద్యార్థిని లోపలకు అనుమతించకపోవడంతో పరీక్ష రాకుండానే వెనుదిరిగారు. పరీక్ష కేంద్రం వద్ద సిఐ వై మురళి రావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి ఆకస్మికంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
పరవాడ : మండల కేంద్రంలో ఇంటర్‌ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి బుధవారం సందర్శించారు. మౌలిక వసతుల కల్పనపై ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీటితో సహా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కశింకోట : మండలంలోని తాళ్ళపాలెం అంబేద్కర్‌ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 372 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 13 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాన్ని జిల్లా అదనపు ఎస్‌పి విజరుభాస్కర్‌ బుధవారం పరిశీలించారు. ఆయన వెంట ఎస్‌ఐ ఆదినారాయణ రెడ్డి, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ మళ్ళ మాణిక్యం ఉన్నారు.
కొత్తకోట:కొత్తకోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బుధవారం ఇంటర్‌ మొదటి ఏడాది పరీక్షలు ప్రారంభం అయ్యాయి.ఈ కళాశాలలో సుమారు 323 మంది మొదటి, రెండవ ఏడాది పరీక్షలకు హాజరు కానున్నారు. బుధవారం మొదటి ఏడాది పరీక్షకు సుమారు 219 హాజరు కావాల్సి ఉండగా జనరల్‌ సబ్జెక్ట్‌ లలో ముగ్గురు, ఒకేషనల్‌ సబ్జెక్ట్‌లలో మరో ముగ్గురు గైర్హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపాల్‌ సాయికుమార్‌ తెలిపారు. విద్యార్థులు ఉదయం 8 గంటలకు హల్‌ టికెట్‌లతో హాజరు కావాలని సూచించారు.
3 పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు
నక్కపల్లి: ఇంటర్‌ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.నక్కపల్లిలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్థానిక రెసిడెన్షియల్‌ కళాశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పరీక్షలు రాశారు.పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల కోలాహలం కనిపించింది.
కేంద్రాలను డిఎస్పి తనిఖీ
నర్సీపట్నంటౌన్‌: మున్సిపాలిటీ పరిధిలో ఏడు పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాయడానికి అనుమతి లేదన్న నిబంధనలతో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకున్నారు. నర్సీపట్నంలో ప్రశాంతంగా ఇంటర్మీడి యట్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. నర్సీపట్నం డిఎస్పి కె.ప్రవీణ్‌ కుమార్‌ రూరల్‌ సిఐ రమణయ్య, పట్టణ ఎస్సై గోవిందరావుతో కలిసి పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, తాగునీరు తదితర సౌకర్యాలను ఆయన పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద మాల్‌ ప్రాక్టీస్‌, కాంపౌండ్‌ లోపలకు బయట వ్యక్తుల చొరబాడకుండా పోలీసు సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పరీక్షా కేంద్రాల వద్ద తగినంత బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
గొలుగొండ:మండలంలో ఏఎల్‌ పురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బుధవారం ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. మండలంలోని నాలుగు కళాశాలల నుండి 250 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా ఎనిమిది మంది పరీక్షలకు హాజరు కాలేదు. ఇందులో ఇద్దరు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావ డంతో పరీక్షలు రాయడానికి అనుమతి ఇవ్వలేదు. గొలుగొండ ఎస్సై నారాయణరావు ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రం వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్‌ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
భీమునిపట్నం : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్‌ మొదటి ఏడాది విద్యార్థులు 636 మందికి గాను 614 మంది తొలి రోజు పరీక్ష (తెలుగు, సంస్కృతం, జిఎఫ్‌సి) రాశారు. 22 మంది పరీక్షకు హాజరు కాలేదు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరిగింది. పరీక్ష రాసేందుకు కేటాయించిన ప్రతి గదిలో కూడా సిసి కెమెరాలు ఏర్పాటుచేసినట్లు కళాశాల ఇంఛార్జి ప్రిన్సిపల్‌, పరీక్షా కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ కె.సూరిబాబు తెలిపారు. ఈ కళాశాలతో పాటు భీమిలి, దొరతోట, మూలకుద్దు, సంగివలస, తగరపువలస, తాళ్ళవలస, ఆనందపురం మండలం బోయిపాలెం ప్రాంతాల్లో ఉన్న మరో 9 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల్లోనూ ఇంటర్‌ పరీక్షలు జరిగాయి.