
ప్రజాశక్తి - భీమవరం
రానున్న సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అన్ని చర్యలూ తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్‌మీనా అమరావతి నుంచి కలెక్టర్, ఎస్‌పిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్‌తోపాటు ఎస్‌పి యు.రవిప్రకాష్, జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ కానాల సంగీత్ మాధుర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో మూడు విభాగాలతో కూడిన రక్షణ దళాలను ఉపయోగించారన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే విధంగా రక్షణ దళాలను ఏర్పాటు చేయడంతో పాటు, మరో నాలుగు విభాగాలను కూడా రక్షణ దళాల సేవల్లో వినియోగించుకోనున్నట్లు తెలిపారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని వివరించారు. ఎన్నికల విధుల నిర్వహణకు 782 మంది రక్షణ సిబ్బంది కొరతను జిల్లా ఎస్‌పి గుర్తించారని, వారి స్థానంలో రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్‌లు, ఎన్‌సిసి, మహిళా పోలీస్ తదితరుల సేవలను ఉపయోగించుకునేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని తెలిపారు. 434 సెక్యూరిటీ వాహనాలు అందుబాటులో ఉన్నాయని, పోలింగ్‌కు సంబంధించి 392 వాహనాలకు ప్రతిపాదించగా ఇంతవరకు అందుబాటులో ఉన్న వాహనాల పూర్తి వివరాలతో కూడిన నివేదిక త్వరలోనే సమర్పిస్తామని చెప్పారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ఉండే భవనాలను గుర్తించామని, వాటిలో ఎక్కువ శాతం పాఠశాలలను పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేశామని తెలిపారు.