'పిట్ట కొంచెం.. కూత ఘనం..!' అన్నట్లు పదేళ్ల చిన్నారి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. పదేళ్లకే డ్రమ్స్‌ను రెండు చేతులతో అలవోకగా వాయించేస్తోంది. ఇంత చిన్న వయసులోనే 'ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డ్'ల్లో పేరు సంపాదించింది మన తెలుగమ్మాయి సియోనా. అసలు డ్రమ్స్ పట్ల అంత చిన్న వయస్సులో ఎలా ఆసక్తి కలిగింది? రికార్డ్ ఎలా సాధించింది? తన లక్ష్యం ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆ చిన్నారి గురించిన వివరాల్లోకి వెళ్లాల్సిందే..
అసలు ఆసక్తి ఎలా కలిగింది అని అడిగితే.. 'నేను విజయవాడకు వేసవి సెలవులకు వెళ్లినప్పుడు చర్చికి వెళ్లాం. అక్కడ డ్రమ్స్ వాయిస్తుంటే.. అలాగే చూశాను కాసేపు.. ఆ తర్వాత నేను ఆ డ్రమ్స్ దగ్గరకు వెళ్లి కూర్చొని, వాయించాను.. అప్పుడు నాకు నాలుగేళ్లు.. అప్పుడు డాడీ నన్ను ఫొటో తీశారు.' అని చెప్పింది చిన్నారి సియోనా.
'ఆ ఫొటో ఇప్పుడూ అలా చూస్తూ ఉండిపోతుంది. ఆరోజు వాళ్ల నాన్నగారు నీకు డ్రమ్స్ అంటే ఇష్టమా అని అడిగితే.. ఏమీ చెప్పలేదు. ఆ డ్రమ్స్ వైపే చూస్తూ ఉండిపోయింది. వెంటనే విజయవాడలోనే మ్యూజిక్ షాప్‌లో వాళ్ల నాన్నగారు తెల్లారేసరికి చిన్న డ్రమ్ సెట్ కొనుక్కొచ్చేశారు. అక్కడ చర్చిలోనే సార్ ఒకరు ఉన్నారు. ఆయన్ని బాబు అని పిలుస్తాం. ఆయన ఇంటికి వచ్చి వారం రోజులు సియోనాకు డ్రమ్స్ వాయించడం నేర్పారు. ఆయన చెప్పినవన్నీ సియోనా చకచకా ఫాలో అవ్వడం చూసి, సార్ ఆశ్చర్యపోయారు. సియోనా తన టాలెంట్ మొత్తం చూపించింది. చేతులతో డ్రమ్స్ వాయించడమే కాకుండా, కాలును సమాంతరంగా ఉపయోగించడం, రిథమ్‌గా డ్రమ్స్ చక్కగా వాయించడం చేసింది. ఆ సార్ ''ఈ పాపకు నేర్పిస్తే తప్పక నేర్చుకుంటుంది!'' అని మాకు చెప్పారు' అని సియోనా తల్లి బి. శిల్పకళ వివరించారు.
చిన్న వయస్సులోనే..
'ఇంత పెద్ద డ్రమ్స్ చూసేసరికి నాకు బోలెడంత ఆసక్తిగా అనిపించింది. ప్రస్తుతం నాకు 11 ఏళ్లు.. 6త్ గ్రేడ్ చదువుతున్నా. డ్రమ్స్ వాయించడంలో మొత్తం 8 గ్రేడ్స్ ఉంటాయి. + డెప్యూట్ కూడా ఉంటుంది. అవన్నీ పూర్తి చేశాను. ఫస్ట్ రా స్కూల్, తర్వాత కిమిట్ స్కూల్ ఎగ్జామ్ చేశాను. వీటికి ఈ మధ్యే పరీక్ష ఇచ్చాను. ఇవన్నీ పూర్తయ్యాక డిప్లొమా చేయాలి.. అయితే అందుకు నేను చిన్న వయస్సు వల్ల అర్హత పొందలేకపోయాను. నాకు 18 ఏళ్లు పూర్తయితే డిప్లొమో చేయొచ్చు. డిప్లొమా అయిపోతే ఎగ్జామినర్‌గా, ఇన్విజిలేటర్ అవ్వొచ్చు. అంటే డ్రమ్స్ నేర్పించడానికి వెళ్లొచ్చు!' అంటూ కళ్లను చక్రల్లా తిప్పుతూ చెప్పింది సియోనా.
చదువులోనూ రాణిస్తూ..
'నేను చదువులో కూడా సెకండ్, ఫస్ట్ ర్యాంకుల్లో ఉంటాను. చదువు, డ్రమ్స్ నేర్చుకోవడం ప్రణాళిక ప్రకారం చేస్తాను. చదువు కోసం ప్రత్యేక సమయం పెట్టుకుంటాను. 4-6 గంటలు డ్రమ్స్ కోసం కేటాయిస్తే.. చదువు కోసం 10-12 కేటాయిస్తాను!' అని వివరించింది సియోనా.
తల్లి త్యాగం..
సియోనా తల్లి శిల్పకళ. ప్రస్తుతం హౌస్ మేకర్‌గా ఉన్నారు. ఎయిర్ ఇండియాలో 2005లో ఎయిర్ హోస్టెస్‌గా చేరారు. '2010లో పెళ్లి చేసుకున్నాను. 2011 పెద్ద పాప సియోనా పుట్టింది. 2012కి చిన్నపాప పుట్టింది. భర్త మెరైన్ ఇంజినీర్.. నేను ఫ్లయింగ్.. ఆరు నెలలు అలా తనూ వెళ్లిపోతారు. పిల్లల దగ్గర ఎవరో ఒకరు.. ఒక పేరెంట్ ఉండాలి. ఇద్దరూ ఆడపిల్లలని నేనే స్టెప్ తీసుకుని, నా జాబ్‌కు రిజైన్ చేశాను. చిన్నపాప కూడా మ్యూజిక్ నేర్చుకుంటుంది. నాకు చాలా ఇష్టం సంగీతం అంటే!' అంటూ చెప్పుకొచ్చారు తల్లి శిల్పకళ.
మ్యూజిక్ డైరెక్టర్ కావాలని..
'నా లక్ష్యం ప్రస్తుతం మ్యూజికల్ డైరెక్టర్ కావాలని. రాక్ స్కూల్ లండన్‌లో ఉంది. చిన్న వయస్సు నుండి డ్రమ్స్ వాయించడంలో జహంగీర్ సార్ గైడ్ చేశారు. నాకు సంగీతం అంటే కూడా ఇష్టం.. మైకెల్ జాక్సన్ డ్రమ్మర్, జనతాన్, ఎ.ఆర్. రెహమాన్, తమన్ సార్.. వీళ్లతో ఒక బ్యాండ్ తయారుచేయాలని.. డ్రమ్స్, పియానో.. ఫాస్ట్‌గా నేర్చుకోవాలి. క్లాసికల్ గిటార్ నెలరోజుల్లో పూర్తి చేయాలనేది ప్రస్తుత లక్ష్యం. భవిష్యత్తులో మాత్రం ఎప్పటికైనా మ్యూజిక్ డైరెక్టర్ కావాలని ఉంది' అని చెప్తోంది సియోనా. 'అసలు రికార్డు కోసం అప్లరు చేసినట్లు మాకు తెలియదు. చాలా హ్యాపీగా ఫీలయ్యాం. మేము ఊహించలేదు. సార్ అప్లరు చేశాక చెబితే మేము నమ్మలేదు. అప్లికేషన్‌ను అప్రూవ్ చేశాక.. అంతా ఎంక్వయిరీ చేశారు. వాళ్లకు కావాల్సినవన్నీ మా దగ్గర నుంచి తీసుకున్నారు. అప్రూవ్ అయిపోయిందనగానే చాలా సంతోషం వేసింది. అలా వరల్డ్ బుక్‌లో పేరు ఉండిపోవడం గ్రేట్ కదా..!' అన్నారు తల్లి శిల్పకళ.
ఆల్ ది బెస్ట్ సియోనా!