Aug 04,2023 21:45

వీధిలోకి వచ్చి హల్‌చల్‌ చేస్తున్న ఏనుగులు

ప్రజాశక్తి - వంగర : మండలంలోని శివ్వాం ఎస్‌సి కాలనీలోకి శుక్రవారం మధ్యాహ్నం ఏనుగుల గుంపు ఒక్కసారిగా ప్రవేశించి హల్‌ చల్‌ చేయడంతో అక్కడ ప్రజలు బెంబోలెత్తిపోయారు. గురువారం సాయంత్రం నాగావళి నది దాటి మన్యం జిల్లా వీరఘట్ట మండలం వైపు వెళ్లిపోయిన ఏనుగులు అర్ధరాత్రి వేళ మళ్లీ తిరిగివచ్చి శివ్వాం ఎస్‌సి కాలనీ సమీపంలోకి చేరుకోవడంతో ప్రజలంతా పరుగులు తీసి భయాందోళనలకు గురయ్యారు. ఆ సమయంలో గొటివాడ సూర్యనారాయణకు చెందిన ఇంటి తలుపులను ఏనుగులు విరగగొట్టడంతో పెద్ద ఎత్తున గ్రామస్తులు కేకలు వేస్తూ బయటకు పరుగులు పెట్టారు. అడవుల్లో ఉండవలసిన ఏనుగులు ఇలా గ్రామాల్లో ప్రవేశించి ఇళ్లపై దాడి చేయడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు ఏనుగులను అటవీ ప్రాంతం వైపు వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని, ఏనుగులు వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.