Aug 27,2023 23:24

హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేస్తున్న పోలీసులు

వజ్రపుకొత్తూరు : అక్కుపల్లి శివసాగర్‌ బీచ్‌లో ఇటీవల కాలంలో స్నానాలకు దిగి ప్రమాదవశాత్తు కెరటాలకు కొట్టుకుపోయి మత్యువాత పడుతున్నారు. ఇటీవల ఇద్దరు మత్యుఒడికి చేరడంతో స్థానికుల నుంచి పోలీసుశాఖపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు చర్యలు ప్రారంభించారు. స్థానిక ఎస్‌ఐ వై.మధుసూదన్‌ ఆధ్వర్యాన ఆదివారం శివసాగర్‌ బీచ్‌లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యాటకులు బీచ్‌లో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. సముద్రం లోతు ఉండే ప్రదేశాల్లో పర్యటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పర్యాటకులు సముద్ర తీరం, ప్రకృతి అందాలు చూసి ఆనందించాలని, వీలున్నంత వరకు సముద్ర స్నానాలకు దూరంగా ఉంటే మంచిదని అన్నారు. తప్పనిసరి పరిస్థితిలో స్నానం చేయాలంటే పెద్దలు పర్యవేక్షణలోనే చేయాలన్నారు. పర్యాటకులు తాకిడి అధికంగా ఉండే ఆదివారం రోజు మెరైన్‌ పోలీసులు గస్తీకి వస్తే స్టేషన్‌ నుంచి కానిస్టేబుల్‌ వస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎఎస్‌ఐ అప్పలనాయుడు, మెరైన్‌ ఎఎస్‌ఐ విజరుకుమార్‌, బైపల్లి సర్పంచ్‌ ప్రతినిధి డొంక విద్యాసాగర్‌, డి.సింహాచలం, పర్యాటకులు పాల్గొన్నారు.