శివనామ స్మరణతో మారుమ్రోగిన యాగంటి
స్వామివారికి టిటిడి తరపున పట్టువస్త్రాలు సమర్పణ
ప్రజాశక్తి - బనగానపల్లె
మండలంలోని ప్రముఖశైవ క్షేత్రం యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం శనివారం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శివనామ స్మరణతో మారు మోగింది. శివరాత్రి బ్రహ్మౌత్సవాల్లో భాగంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉమా మహేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా యాగంటి ఉమామహేశ్వరస్వామికి టిటిడి తరఫున పట్టు వస్త్రాలను టిటిడి పాలక మండలి సభ్యులు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి సమర్పించారు. యాగంటి దేవస్థానం చరిత్రలో మొట్టమొదటిసారిగా టిటిడి తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. టిటిడి మరో పాలకమండలి సభ్యులు మారుతీ ప్రసాద్ దంపతులు తిరుమల నుంచి పట్టువస్త్రాలను తీసుకరాగా వాటిని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి, ఆయన సతీమణి కాటసాని ఉమామహేశ్వరమ్మలు తలపై పెట్టుకుని మేళతాలతో, ఆలయ ప్రధాన అర్చకుల వేద మంత్రోచ్ఛరణల మధ్య ఊరేగింపుగా బయలుదేరి గర్భగుడిలో స్వామివారికి సమర్పించారు. యాగంటి క్షేత్రానికి తరలివచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ చైర్మన్ తోట బుచ్చిరెడ్డి, ప్రత్యేక అధికారి హరిచంద్రారెడ్డిలు అన్ని ఏర్పాట్లు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో బనగానపల్లె, అవుకు నందివర్గం ఎస్‌ఐలు రామిరెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, రామాంజనేయరెడ్డి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉమా మహేశ్వర నిత్య అన్నదానం, ఉమామహేశ్వర రైతు అన్నదాన సత్రం, ఆర్యవైశ్య అన్నదాన సత్రం, బ్రాహ్మణ అన్నదాన సత్రం, యాదవ అన్నదాన సత్రాల ఆధ్వర్యంలో భక్తులకు భోజనాలను ఏర్పాటు చేశారు. దేవస్థానంలో ఏర్పాటు చేసిన రేలారే రేలా కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో యాగంటి దేవస్థానం మాజీ చైర్మన్ దోనపాటి యాగంటి రెడ్డి, ఉమామహేశ్వర నిత్యాన్నదాన సత్రం కార్యదర్శి దస్తగిరిరెడ్డి, దేవస్థానం పాలకమండలి సభ్యులు బింగిమళ్ళ హనుమాన్ శెట్టి, యామా చిన్న పుల్లారెడ్డి, సంగు రామసుబ్బారెడ్డి, చౌడేశ్వరి దేవస్థానం మజీద్ చైర్మన్ పిఆర్ వెంకటేశ్వర రెడ్డి, వైసిపి నాయకులు మీరాపురం మనోహర్ రెడ్డి, పాతపాడు వెంకటేశ్వరరెడ్డి, జోలాపురం తిరుపాల్, పూజారులు సిబ్బంది పాల్గొన్నారు .










