Oct 09,2023 23:31

ప్రజాశక్తి - వేటపాలెం : స్థానిక సెయింట్ ఆన్స్‌ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ డిపార్ట్మెంట్ మూడవ సంవత్సరం విద్యార్థులకు సర్వేయింగ్‌పై ఏడు రోజుల వర్క్ షాపును ప్రారంభించినట్లు కళాశాల అడ్మిని స్ట్రేటివ్ మేనేజర్ ఆర్‌వి రమణమూర్తి సోమవారం తెలిపారు. విజయవాడ యునిక్ సర్వే సొల్యుషన్స్ ఆధ్వర్యములో ఈ వర్క్ షాపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సివిల్ ఇంజినీరింగ్ హెచ్‌ఒడి సిహెచ్ పవన్ కుమార్ మాట్లాడుతూ ఆధునిక సమాజ అవసరాలకు తగ్గట్లుగా విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని అన్నారు. తద్వారా ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందాలని ఆకాంక్షించారు. యునిక్ సర్వే సొల్యుషన్స్ ప్రతినిధి టి ప్రైమ్ బాబు మాట్లాడుతూ సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు సర్వేయింగ్‌ను అవగాహన చేసుకొని టోటల్ స్టేషన్ ద్వారా సర్వే చేసి రివిట్ సాఫ్ట్వేర్ ద్వారా వాటిని ఆచరణలో పెట్టినట్లైతే అద్భుతమైన ఫలితాలు రాబట్టవచ్చని తెలిపారు. ఆధునిక సమాజ సాంకేతిక అవసరాలను బట్టి అనేక అంశాలను, వ్యూహాలను అమలు పరిచినట్లైతే పరిశ్రమలలో గణనీయమైన వృద్ధి సాధించవచ్చని తెలిపారు. సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు టోటల్ స్టేషన్, రివిట్ సాఫ్ట్వేర్‌పై అవగాహన కల్పించి, ప్రాక్టికల్స్‌ నిర్వహించి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎం వేణుగోపాలరావు పాల్గొన్నారు.