ప్రజాశక్తి-గుంటూరు : ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఇఎపిసెట్-2023 ఫలితాల్లో గుంటూరుకు చెందిన యక్కంటి ఫణి వెంకట మణీందర్‌రెడ్డి రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించారు. మణీందర్‌రెడ్డి రైతు కుటుంబానికి చెందిన వారుకాగా ఆయన తల్లిదండ్రులు అనురాధ, శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాకు చెందిన వారు. మణీందర్‌రెడ్డి చదువు కోసం వీరు ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు వచ్చి ఇక్కడే ఉంటున్నారు. మణీందర్‌రెడ్డి ప్రాథమిక విద్య నగరంలోని వివిధ పాఠశాల్లో పూర్తి చేయగా, 6వ తరగతి నుంచి ఇంటర్ వరకూ భాష్యం విద్యా సంస్థల్లో చదివారు. పదో తరగతిలో కోవిడ్ నేపథ్యంలో ఉత్తీర్ణుడు కాగా, ఇంటర్‌లో 976 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా మణీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఐఐటి బొంబాయిలో ఇంజినీరింగ్ పూర్తి చేయాలని, ఆ తర్వాత సివిల్ సర్వీసెస్‌లోకి వెళ్లాలని తన లక్ష్యమని చెప్పారు.
ఇదిలా ఉండగా ఇంజినీరింగ్ విభాగంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన అడ్డగడ వెంకట శివరాం 153.9 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధించాడు.










