Aug 03,2023 23:10

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: ప్రమాదకరంగా ఉన్న చనుమోలు వెంకట్రావు (సివిఆర్‌) ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి రోడ్డును యుద్ధప్రాతిపదికన బాగు చేయాలని సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ డిమాండ్‌ చేశారు. సివిఆర్‌ ఫ్లైఓవర్‌ రోడ్డును బాగు చేయాలని కోరుతూ సిపిఎం పశ్చిమ సిటీ ఆధ్వర్యంలో సివిఆర్‌ ఫ్లైఓవర్‌పై గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఫ్లైఓవర్‌ గుండా ప్రతిరోజూ వేలాది వాహనాలు తిరుగుతుంటాయని తెలిపారు, బ్రిడ్జిపై రోడ్డు మొత్తం గుంతలు పడి, ఇనుప చువ్వలు బయటపడి ప్రమాదకరంగా ఉందన్నారు. ఇంత దారుణంగా ఉన్న బిడ్జి రోడ్డును బాగుచేయాలన్న ఉద్దేశం విజయవాడ వెస్ట్‌, సెంటల్ర్‌, మైలవరం, గన్నవరం ఎమ్మెల్యేలకు లేనట్లు ఉందన్నారు. రోడ్డు ట్యాక్సులు భారీగా పెంచి వందల కోట్ల రూపాయలు వసూళ్లు చేస్తున్న ప్రభుత్వాలు రోడ్లను బాగు చేయకపోవడం బాధాకరమన్నారు. 50వ డివిజన్‌ కార్పొరేటర్‌, సిపిఎం ఫ్లోర్‌లీడర్‌ బోయి సత్యబాబు మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కాలనీ, జక్కంపూడి, అంబాపురం, నైనవరం, షాబాద్‌, అప్పారావు పేట, అంబాపురం, సింగ్‌నగర్‌, నున్న, గన్నవరం తదితర ప్రాంతాలకు 50 వేల మంది ప్రజలు నిరంతరం రాకపోకలు సాగించే చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్‌ బ్రిడ్జి రోడ్డు గుంతలతో ప్రమాదకరంగా తయారైందన్నారు. వైసిపి ప్రభుత్వం పన్నులు కట్టించుకునే దానిలో చూపించే శ్రద్ధ రోడ్లు నిర్మించే దానిలో చూపకపోవటం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆంజనేయులు, నగర నాయకులు కె.సూరిబాబు, పి.రాజు, జి.బాలదుర్గారావు ఎ.శ్రీను. పి రాజేష్‌, రవి, వీరయ్య, శేషయ్య, సూర్యనారాయణ, పుల్లారావు, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.