ప్రజాశక్తి - నగరం
ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్తలు సివి. రామన్, సత్యేంద్రనాథ్ బోస్ చిత్రపటాలను శ్రీవెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాల పియుసి మొదటి బ్యాచ్ (1969-70) విద్యార్థి డాక్టర్ వైవీఎస్ రామకృష్ణ కళాశాలకు బహూకరించారు. ప్రస్తుతం హైదరాబాదులోని ప్రముఖ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న రామకృష్ణ తమ కుటుంబ సభ్యులు ద్వారా, సివి రామన్ వర్ధంతి సందర్భంగా నేడు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వల్లభనేని బుచ్చయ్యచౌదరికి అందజేసారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ చదువుకున్న కళాశాల పట్ల అభిమానంతో నేటి తరం విద్యార్థులకు శాస్త్రవేత్తల గురించి తెలిసేలా వారి చిత్రపటాలను అందించినందుకు అభినందనలు తెలిపారు. కళాశాలలో విద్యను పూర్తి చేసుకుని 50సంవత్సరాలైనా కళాశాల పట్ల మక్కువ చూపడం అభినందనీయమని అన్నారు. రామకృష్ణ అందించిన చిత్రపటాలను కళాశాల భౌతికశాస్త్ర ప్రయోగశాలలో ఏర్పాటు చేయిస్తామని ప్రిన్సిపాల్ డాక్టర్ అనగాని హరికృష్ణ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మాగంటి సుధాకరరావు, భౌతికశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పంచుమర్తి శ్రీనివాసరావు, అమరేష్‌రెడ్డి, అధ్యాపకులు కామేష్, హిరణ్మయి పాల్గొన్నారు.