వీరఘట్టం: అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో సున్నా అన్న చందంగా ఉందని మండలంలోని రైతాంగం పరిస్థితి. మండలం చుట్టూ నదులు, సాగునీటి కాలువలు ఉన్నప్పటికీ శివార ప్రాంతాల భూములకు సాగునీరు అందకపోవడంతో ప్రతి ఏటా సాగునీరు కోసం అన్నదాతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తోటపల్లి ప్రధాన ఎడమ కాలువ పరిధిలోని రాయవలస నుంచి మొదటి కెనాల్ ద్వారా కడకల్లా, నడిమికెల్లా, విక్రంపురం, చిట్టిపూడివలస, నడుకూరు, కొట్టుగుమ్మడ, గడగమ్మ గ్రామాలకు సాగునీరు రావాల్సి ఉంది. ఈ గ్రామాలను దాటుకొని గడగమ్మకు వచ్చేసరికి అడుగు నీరే వస్తుంది. దీంతో మోటర్లు సదుపాయం ఉన్న రైతులు వాటిపై ఆధారపడి పంటలు సాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏ అవకాశం లేని వారు వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వరుణుడు కరుణిస్తే కాస్తాకూస్తో పంట చేతికి వస్తుందని, లేకుంటే పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని, అప్పుల పాలవుతున్నట్లు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల పంట భూములు బీడు భూములుగా మారుతున్నాయి. ఇదే ప్రధాన ఎడమ కాలువ ద్వారా సెవెంత్ బ్రాంచి హుస్సేన్‌పురం గ్రామ జంక్షన్ నుంచి తూడి, రేగులపాడు, యు.వెంకంపేట, పివిఆర్ పురం, చిదిమి వంటి గ్రామాల పంట భూములకు సాగునీరు సరఫరా కావాల్సి ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా కాకపోవడంతో అన్నదాతలు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శివార ప్రాంతమైన పివిఆర్ పురం రైతులకు ప్రతి ఏటా సాగునీటి కోసం అవస్థలు తప్పడం లేదు. దీంతో వర్షాలపైన ఆధారపడి పంటలు సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నదాతలు ఆరదోళన చెందుతున్నారు.
సాగునీటి గగనమే
మండలంలోని ప్రతి ఏటా 16వేల ఎకరాలకు పైబడి వరి పంట సాగుతున్నట్లు వ్యవసాయ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ ఏడాది కూడా తోటపల్లి ప్రధాన ఎడమ కాలువ ఆధునీకరణ పనులు పూర్తి కాకపోవడంతో సాగునీటికి గగనమే ఉంటూ ఆయా ప్రాంతాలకు చెందిన అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కాలువ ఆధునీకరణ పనులు పూర్తయితే ఏడాదికి రెండు పంటలు సాగు చేసుకోవచ్చునని, ఆ దిశగా ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం కత్తుల కవిటి, హుస్సేన్ పురం గ్రామాల మధ్య కాలువ లైనింగ్ పనులు మాత్రమే జరిపారు. ఈనెల 20న సర్దార్ గౌతు లచ్చన్న రిజర్వాయర్ (తోటపల్లి బ్యారేజీ) నుండి సాగునీరు విడిచి పెట్టేందుకు అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. ఈ సమయంలోనైనా ఈ భూములకు సాగునీరు విడిచిపెట్టాలని ఈ ప్రాంత అన్నదాతలు అధికారులు, పాలకులను వేడుకుంటున్నారు.










