
పెరుగుతున్న ధరలు, కుదించుకుపోతున్న ఉపాధి అవకాశాలతో దేశ ప్రజలు సంక్షోభం ముంగిట నిలిచి ఉన్న వేళ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ సంఘ పరివారం శివుని పేరుతో మరో ఉన్మత్త క్రీడకు తెరతీశాయి. ప్రజల నమ్మకాలతో, మనోభావాలతో చెలగాటమాడటం, వారి నెత్తుటి ధారలతో అధికారానికి బాటలు వేసుకోవడం హిందూత్వ మతతత్వ శక్తులకు కొత్తేమి కాదు. అయోధ్య వివాదంలో దేశం అటువంటి ఉపద్రవాన్నే చూసింది. ఆ సంఘటన ప్రకంపనలు ఇప్పటికీ దేశాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. వాటిని ఉపయోగించుకునే బిజెపి అధికార పీఠానికి ఎగబాకింది. బాధ్యత గల నాయకులు, పాలకులు ఎవరైనాగానీ అటువంటి ఉన్మాద పరిస్థితులు మళ్లీ రాకూడదని కోరుకుంటారు. కానీ, సంఫ్‌ుపరివార్ తీరు వేరు! కార్పొరేట్ మతతత్వ బంధాన్ని పటిష్టపరుచుకుంటూ ప్రజలను మతపరంగా చీల్చేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా దేశాన్ని మత రాజ్యంగా మార్చాలని చూస్తోంది. దీనిలో భాగంగానే వారణాసి వివాదాన్ని తెరపైకి తెచ్చింది. శతాబ్దాలుగా వారణాసిలో వెల్లివిరిసిన సామరస్యంపై విషం చిమ్ముతోంది. ఒక పథకం ప్రకారం హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఈ చిచ్చు దావానలంలా మారి దేశ ప్రజలను శలభాల్లా మాడ్చేస్తుంటే 2024 ఎన్నికల్లో ఓట్ల వేట సాగించి, అధికారాన్ని పదిలం చేసుకోవాలన్నదే వారి వ్యూహం! అయోధ్యలో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే నాటి ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సి.ఎం కేశవ్ ప్రసాద్ మౌర్య వారణాసి లోని జ్ఞానవాపి మసీదు, మధుర లోని షాహి ఈద్గాలను ప్రస్తావించడమే దీనికి నిదర్శనం. బిజెపి ఎజెండాలో ప్రజలను చీల్చే ఈ మతోన్మాద ఎజెండా తప్ప మరొకటి లేదనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి?
హిందూత్వ మతతత్వ శక్తులు ఎప్పటి నుండో జ్ఞానవాపి మసీదుపై కన్నేశాయి. అప్పటి నుండి రకరకాల కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. అవి అలా ఉండగానే మసీదు గోడలపై దేవతామూర్తుల చిత్రాలు ఉన్నాయని, వాటి వద్ద పూజలు జరుపుకోవడానికి అనుమతివ్వాలని కోరుతూ కొందరు మహిళలు వేసిన పిటిషన్‌ని పరిగణలోకి తీసుకుని స్థానిక కోర్టు మసీదులో సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 1991లో రూపొందించిన ప్రార్ధనా స్థలాల చట్టానికి ఈ అదేశాలు విరుద్ధం! 1947 ఆగస్టు 15 నాటికి దేశంలోని దేవాలయాలు, మసీదులు, ఇతర ప్రార్ధనాస్థలాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంచాలని, వాటిలో మార్పులు చేయకూడదని ఈ చట్టంలో నిర్దేశించారు. అప్పటికే వివాదంలో ఉన్న బాబ్రీ మసీదును దీని నుండి మినహాయించారు. ఇదే అంశాన్ని గుర్తు చేస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ విచారణలో ఉండగానే సర్వే పూర్తి కావడం, శివలింగం దొరికిందని కోర్టుకు చెప్పడం, ఆ స్థలంలోకి ఎవరినీ అనుమతించకూడదని ఆదేశాలను స్థానిక కోర్టు ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. సాధారణంగా పైకోర్టు పరిధిలో వ్యాజ్యం ఉన్నప్పుడు అదే కేసును విచారించడానికి దిగువ కోర్టులు సిద్ధం కావు. ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా జరిగింది. సుప్రీంకోర్టు తీర్పునకు ఒక రోజు ముందు ఆ స్థలాన్ని సీజ్ చేయాలని స్థానిక కోర్టు ఆదేశించింది.
పైగా సర్వే నివేదిక కోర్టుకు చేరకముందే మసీదు ఆవరణలోని బావిలో దొరికిన దానిని శివలింగంగా ధర్మాసనం నిర్ధారించింది. అత్యున్నత న్యాయస్థానం కూడా ఆ నిర్ధారణను కొనసాగించడమే విచారకరం! నిజానికి దిగువ కోర్టులో విచారణ సందర్భంగా పిటిషన్ల లాయర్ తమకు మూడడుగుల పొడవున్న రాయి దొరికిందని, దానిని తాము శివలింగం అంటున్నామని, వారు (మసీదు కమిటీ) ఫౌంటెన్‌గా చెబుతున్నారని మీడియాకు వివరించారు. సర్వే నివేదిక రాకముందే, ఏ ఆధారాలతో ధర్మాసనం ఆ రకమైన నిర్ధారణకు వచ్చిందో తేలాల్సి ఉంది. ఇక ముస్లింల నమాజుకు అనుమతి, శివలింగం దొరికిన స్థలానికి భద్రత కల్పించడం వంటి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు రెండు మతాలకు చెందిన వారిని తాత్కాలికంగా బుజ్జగించడానికి పనికి వస్తాయి కానీ, సమస్య శాశ్వత పరిష్కారానికి పనికిరావు. 1991 చట్టాన్ని ప్రాతిపదికగా తీసుకుని ధర్మాసనం స్పందించి ఉండాలి. అలా జరిగి ఉంటే మతోన్మాద శక్తులకు చెంపపెట్టై ఉండేది. ఇప్పుడు సామరస్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని కాపాడుకోవాలి. ఇటువంటి ఉత్పాతాలను ఎన్నింటినో ఎదుర్కొని ఐక్యంగా నిలిచిన భారత జాతి మనది! అదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలి. మతోన్మాదుల కుట్రలను తిప్పికొట్టాలి. నిత్య జీవిత సమస్యల పరిష్కారం కోసం పాలకులను నిలదీయాలి.