May 14,2023 23:41

బొడ్డేరుపై కేడీపేట వద్ద ఉన్న వంతెన

ప్రజాశక్తి-గొలుగొండ:గొలుగొండ, కొయ్యూరు మండలా లను కలుపుతూ ఉన్న పురాతన వంతెనలు శిధిలావస్థకు చేరుకున్నాయి. ముఖ్యంగా కృష్ణదేవిపేట, చీడిగుమ్మల, గుజ్జుమానుపాక, పెదమాకవరం తదితర వంతెనలు శిధిలావస్థలో ఉన్నాయి. దీంతో, ఇటుగా ప్రయాణించే వాహనదారులు, పాదచారులు భయాందోళన చెందుతున్నారు. కృష్ణదేవిపేట, గుజ్జుమనుపాకల, చీడిగుమ్మల వంతెనలను నిర్మించి ఎనిమిదిన్నర దశాబ్ధాలకు పైగా అవుతోంది. వీటికి మరమ్మత్తులు చేపట్టక పోవడంతో శిధిలావస్థకు చేరుకున్నాయి. ఈ వంతెనలు బలహీన పడటానికి కారణం గతంలో వీటికి సమీపంలో ఇసుక తవ్వకాలు జరగడమేనని తెలుస్తోంది. నిత్యం మైదాన, ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు సాగించే వందలాది ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ఈ వంతెనల మీదుగా వెళుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగు తుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పెదమాకవరం తదితర వంతెనల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
అనకాపల్లి జిల్లా తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దులను కలిసే ఈ వంతెనలు కూలితే వాహనాల రాకపోకలు నిలిచిపోతాయి. కృష్ణదేవిపేట వంతెన నుంచి రాకపోకలు నిలిచిపోతే గమ్య స్ధానాలకు చేరాలంటే అదనంగా మరో 10 కిలో మీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. పెదమాకవరం వంతెన నుంచి రాకపోకలు నిలిచిపోతే కృష్ణదేవిపేట నుంచి చింతపల్లి, పాడేరు తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే 50కిలో మీటర్ల దూరం ప్రయాణించి నర్సీపట్నం మీదుగా వెళ్లాల్సి వస్తుంది. చీడిగుమ్మల వంతెన కూలితే కృష్ణదేవిపేట, ఏళేశ్వరం ప్రయాణికులు నాతవరం మీదుగా 20 కిలో మీటర్లు అదనంగా ప్రయాణించి నర్సీపట్నం రావలసి ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ వంతెనల మరమ్మత్తులకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
దీనిపై ఆర్‌అండ్‌బి ఏఈఈ ప్రసాద్‌ వివరణ కోరగా కృష్ణదేవిపేట, గుజ్జుమనుపాకల, చీడిగుమ్మల వంతెనలను 1936లో నిర్మించగా మరో పదేళ్ల గడువు ఉందన్నారు. వీటికి మరమ్మత్తులు చేపట్టాల్సి ఉందన్నారు. దీని కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. రామరాజుపాలెం వంతెన స్ధానంలో కొత్తగా వంతెన నిర్మాణం చేపడు తున్నామని చెప్పారు. పెదమాకవరం వంతెనను కూల్చి వేసి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా కొత్త వంతెన నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు.