ప్రజాశక్తి-వీరఘట్టం : వడ్డించేవాడు మనోడు అయితే కడబంతిలో కూర్చున్నా ఫర్వాలేదన్న చందంగా కాంట్రాక్టర్ల తీరుంది. అధికారి మనోడైతే పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లేకపోయినా ఫర్వాలేదు, చకచకా పనులు చేసి బిల్లులు చెల్లింపులు చేసుకోవచ్చన్నట్లు వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్టర్లు ఇచ్చే కాసులకు అధికారులు కక్కుర్తి పడడంతో చేసిన పనుల్లో నాణ్యతలేక నిర్ణీత కాలం గడవకముందే సర్కారు భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.
మండలంలోని సంధిమానుగూడ, పెద్దూరు, జె.గోపాలపురం, పాపంపేట, కంబరవలస ప్రాథమిక పాఠశాలలతోపాటు చిట్టపూడివలస, రేగులపాడు, బొడ్లపాడు, హుస్సేనపురం, పాపంపేట, తదితర గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. చిన్నారులకు అందులోనే విద్యాబోధన చేపడుతున్నారు. దీంతో ఏ సమయంలో ఏం జరుగుతుందోనని తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. చిట్టపూడివలస అంగన్వాడీ కేంద్రాన్ని 2021 జనవరి నాలుగో తేదీన అప్పటి ఉమ్మడి జిల్లా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పరిశీలించారు. భవనం పూర్తిగా శిథిలావస్థమైందని కార్యకర్త కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడే ఉన్న ఇంజినీరింగ్ అధికారులకు అంచనా వేసి నివేదిక తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పరిశీలన చేసి దాదాపుగా రెండున్నర ఏళ్లు పూర్తికావస్తున్నప్పటికీ ఎటువంటి పనులూ చేపట్టలేదు. దీంతో చిన్నారులతోపాటు విధులు నిర్వహిస్తున్న కార్యకర్త, సహాయకురాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే భవనం స్లాబ్ పెచ్చులూడిపోతోంది. రేగులపాడు, బొడ్లపాడు, పాపంపేట, తదితర గ్రామాల్లో ఇదే పరిస్థితి. ప్రస్తుతం అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలు కారణంగా వర్షపు నీరు స్లాబ్ పైనుంచి కిందకు దిగడంతో గోడలు బీటలు వారుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎటువంటి ప్రమాదాలు జరగకముందే తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.










