ప్రజాశక్తి- కశింకోట
మండలంలోని కచ్చళ్ళపాలెం గ్రామంలో ఉన్న మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. దీంతో చిన్నారులు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటున్నారు. భవనం ఎప్పుడు కూలితుందో తెలియని స్థితిలో ఉండడంతో కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలను కన్నూరుపాలెంలోని ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించారు.
కశింకోట మండల కేంద్రానికి 21 కిలోమీటర్లు, కన్నూరుపాలెం మెయిన్ రోడ్డుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కచ్చళ్లపాలెం ఏజెన్సీ ప్రాంతాన్ని తలపించేలా ఉంటుంది. గ్రామాలో సూమారు 400 జనాభా ఉంది. ఇక్కడున్న మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలకు 30 సంవత్సరాల క్రితం భవనాన్ని నిర్మించారు. తరువాత చిన్నచిన్న మరమ్మతులు చేసినా ప్రస్తుతం అది పూర్తిగా శిథిలమైన ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిలో ఉంది. ఈ పాఠశాలకు పర్మినెంట్ ఉపాధ్యాయుని ఉండగా, గతేడాది 1 నుంచి 5వ తరగతి వరకు 23 మంది విద్యార్థులు విద్యనభ్యసించేవారు. ప్రస్తుతం ఆరుగురు బాలికలు, ఏడుగురు బాలురు మొత్తం 13 మంది ఉన్నారు. భవనం శిథిలావస్థలో ఉండడంతో కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలను కన్నూరుపాలెంలోని ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు.
నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రతభుత్వం చెబుతుండగా, కూలిపోయే స్థితిలో ఉన్న ఈ పాఠశాలకు నాడు-నేడు రెండు విడతల్లోనూ నిధులు మంజూరు చేయలేదు. ఈ పాఠశాల భవనం విషయంపై విద్యా కమిటీ చైర్మన్ వరహాలు, గ్రామస్తులు విద్యాశాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ విషయంపై పాఠశాల ఉపాధ్యాయురాలు లీలారాణిని వివరణ కోరగా తను వచ్చి రెండేళ్లు అయిందని, పాఠశాల భవనం విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి పిల్లలను ఇక్కడే చదివించాలని కోరినట్లు తెలిపారు. పాఠశాలకు కొత్త భవనం నిర్మాణం చేస్తే పిల్లలను ఇక్కడే చదివిస్తామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మూడో దఫా అయినా నిధులు మంజూరు చేసి పాఠశాలకు కొత్త భవనం నిర్మాణం చేయాలని స్థానికులు కోరుతున్నారు.










