ప్రజాశక్తి -సామర్లకోట రూరల్ సామర్లకోట పోలీస్ స్టేషన్ పరిధిలో శిథిలమైన సిబ్బంది క్వార్టర్స్ కారణంగా పోలీసు శాఖపై ఏటా సుమారు రూ.21.60 లక్షల వ్యయ భారం పడుతోంది. పోలీస్ స్టేషన్ వెనకనగల క్వార్టర్స్‌లో పోలీసు సిబ్బంది నివసించాల్సి ఉండగా వారు బయట అద్దె గృహాల్లో నివసిస్తుండడంతో హెచ్‌ఆర్‌ఎ పేరుతో ఈ వ్యయం అదనంగా పోలీసు శాఖపై పడుతోంది. 15 ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో రూ.లక్షలు ఏటా అదనంగా భారాన్ని పోలీస్ శాఖ భరించాల్సి వస్తోంది.
సామర్లకోట పట్టణంలోని పొలీస్ స్టేషన్ ఉభయ తూర్పు గోదావరి జిల్లాల్లోనే ముఖ్యమైన స్టేషన్‌గా పూర్వం నుంచి గుర్తింపు పొందింది. ఈ స్టేషన్లో అన్ని షిఫ్టులూ కలిపి 30 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తూన్నారు. వీరికి సంబంధించి పోలీస్ స్టేషన్ ఆనుకుని పోలీస్ శాఖకు చెందిన సొంత స్థలంలో పూర్వమే క్వార్టర్స్ నిర్మించారు. సిబ్బంది అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండే విధంగా ఈ క్వార్టర్స్‌ను ఏర్పాటు చేసి సిబ్బంది అంతా ఒకే ప్రాంగణంలో నివసించే విధంగా అప్పట్లో ఉన్నతాధికారులు ఈ క్వార్టర్స్ నిర్మాణాన్ని చేపట్టారు. ప్రస్తుతం ఆ గహాలన్నీ పూర్తిగా శిథిలమై వథాగా పడి ఉన్నాయి. చూసేందుకు అడవిని తలపించే విధంగా పొదలు, చెట్లు విపరీతంగా పెరిగి విష సర్పాలకు నిలయాలుగా మారాయి. సుమారు 5 ఎకరాలకు పైబడి ఉన్నాయి ప్రదేశంలో సిబ్బంది క్వార్టర్లతో పాటు వారి పిల్లలకు క్రీడ స్థలాన్ని, పార్కులు ఏర్పాటు చేసుకునే వీలుంది. దానికి మించి ఈ స్థలానికి ప్రస్తుత మార్కెట్ రేటు బట్టి చూస్తే ఎంతో విలువైన స్థలాలుగా ఈ స్థలం కనిపిస్తుంది. చుట్టూ ప్రహరీ ఏర్పాటు ఉన్నందున ఈ స్థలం ఎలాంటి ఆక్రమణలకు గురికాకుండా పదిలంగానే ఉంది. ఎక్కడైనా ప్రహరీ కూలే పరిస్థితి ఉంటే దాని ద్వారా స్టేషన్ ఆవరణలో స్థలాలు ఆక్రమణలకు గురయ్య అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం 'హెచ్‌ఆర్‌ఎ' కింద సిబ్బంది క్యాడర్‌ను బట్టి రూ.4 వేల నుంచి రూ.8 వేల వరకు పోలీస్ శాఖ హెచ్‌ఆర్‌ఎ చెల్లింపులు చేస్తోంది. దీనితో సిబ్బంది అంతా సామర్లకోట లోనే కాక కాకినాడ పరిసర ప్రాంతాల్లో వారికి నచ్చిన అద్దె ఇంటిలో కాపురం ఉంటూ అక్కడ నుంచి వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే 30 మంది సిబ్బంది అద్దె చెల్లింపులు సరాసరీన లెక్కగడితే ఏడాదికి రూ.21.60 లక్షల వరకై అవుతోంది. ఇలా గత 15 సంవత్సరాల ఖర్చు చూసుకుంటే రూ.3.24 కోట్ల మేర పోలీస్ శాఖ సిబ్బంది అద్దె గృహాల భారాన్ని భరించాల్సి వస్తుంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లోశని ఉన్నదన్న చందంగా అవసరమైన స్థలం ఉండికూడా శిథిలమైన క్వార్టర్స్ స్థానంలో కొత్తగా క్వార్టర్స్ నిర్మాణం జరగక పోవడంతో ఈ విలువైన స్థలాలు వథాగా మారాయి. పైగా స్టేషన్ సిబ్బంది విష సర్పాల భయంతో ప్రతిరోజు విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. గత టిడిపి ప్రభుత్వంలో అప్పటి హోమ్ శాఖ మంత్రి చినరాజప్ప ఆధ్వర్యంలో నూతన క్వార్టర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ ప్రతిపాదనలు పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా ఉంది. ఇప్పటికైనా పోలీస్ ఉన్నతాధికారులు సామర్లకోట స్టేషన్ ఆవరణలో శిథిలమైన క్వార్టర్స్ స్థానంలో కొత్త క్వార్టర్స్ నిర్మించి పూర్వ వైభవాన్ని తీసుకు రావాలని పలువురు కోరుతున్నారు.










