ఎంఎల్‌ఎల పని తీరుపై 16న సిఎం జగన్ సమీక్ష
'గడపగడప'కూ కార్యక్రమం అమలే ప్రధాన అంశం
పనితీరు సరిగా లేకపోతే టిక్కెట్‌కు ఎసరంటూ ఇప్పటికే హెచ్చరికలు
జిల్లాలో ఐదారుగురుపై అధిష్టానం అసంతృప్తి
మరోసారి గట్టిగా హెచ్చరించే అవకాశం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
అధికారపక్షం వైసిపికి చెందిన సిట్టింగ్ ఎంఎల్‌ఎల్లో టెన్షన్ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌పై ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఎంఎల్‌ఎల పని తీరుపై ఈ నెల 16న ఆ పార్టీ అధినాయకుడు జగన్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో ప్రధానంగా 'గడపగడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమం సాగిన తీరుపైనే ప్రధానంగా చర్చ సాగే అవకాశం ఉంది. గత సమీక్షా సమావేశాల్లోనూ ఇదే ప్రధాన అంశంగా సాగింది. అప్పట్లో గడపగడపకూ సరిగ్గా తిరగని ఎంఎల్‌ఎలను, మంత్రులను, మాజీ మంత్రులను సైతం జగన్ హెచ్చరించారు. పని తీరు మెరుగుపర్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వడం సాధ్యం కాదని తీవ్రంగా హెచ్చరించిన దాఖలాలున్నాయి. ఈసారి జరిగే సమీక్షా సమావేశంలోనూ సరిగ్గా పనితీరు కనబరచని ఎంఎల్‌ఎలను మరోసారి గట్టిగా మందలించే పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఎన్నికలకు ఏడాదిన్నర మాత్రమే గడువు ఉండటంతో ఎన్నికల వ్యూహాలపై వైసిపి అధిష్టానం దృష్టి సారించింది. రెండు జిల్లాల్లోనూ 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా 12 చోట్ల వైసిపి ఎంఎల్‌ఎలే ఉన్నారు. పాలకొల్లు, ఉండిలో మాత్రం టిడిపి ఎంఎల్‌ఎలు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ వైసిపి గెలవాలనే నినాదంతో వైసిపి అధిష్టానం ముందుకు సాగుతోంది. దీంతో ప్రతి నియోజకవర్గంపైనా ఇప్పటి నుంచే దృష్టి సారించింది. ప్రజల్లో తిరగని, గ్రూపు తగాదాలతో చికాకులు తెప్పిస్తున్న ప్రజాప్రతినిధులపైన జగన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. చాలామంది ఎంఎల్‌ఎలు 'గడపగడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని తూతూమంత్రంగా సాగిస్తున్నట్లు అధినాయకత్వం భావిస్తోంది. చింతలపూడితోపాటు పలు నియోజకవర్గాల్లో గ్రూపు తగదాలు కొనసాగుతుండటంపైనా వైసిపి అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు చర్చ సాగుతోంది. ఇలాంటి సమస్యలను ఇప్పటి నుంచే పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని అంచనాతో ముందుగానే ఎంఎల్‌ఎలను గాడిన పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రెండు జిల్లాలోనూ 14 నియోజకవర్గాలు ఉండగా ఐదారు నియోజకవర్గాల్లో 'గడపగడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమం సరిగా సాగడం లేదనే భావన అధిష్టానం దృష్టిలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆ నియోజకవర్గాలు ఏమిటనే దానిపై సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు చెప్పకపోయినా వచ్చే ఎన్నికల్లో ఐదారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు తథ్యమనే ప్రచారం సాగుతోంది. ఇప్పుడే ప్రకటిస్తే ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో ప్రస్తుత హెచ్చరికలతో సరిపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిలో తాజా, మాజీ మంత్రుల స్థానాలు కూడా ఉన్నట్లు చర్చ నడుస్తోంది. 'గడపగడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమం సక్రమంగా నిర్వహించి ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు తధ్యమని వైసిపి భావిస్తోంది. దీంతో ఈ కార్యక్రమం సరిగా అమలు చేయని ఎంఎల్‌ఎలపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది. సిటింగుల్లో ఎంతమందికి టిక్కెట్ దక్కుతుందోననే చర్చ ఇప్పటికే వైసిపిలో నడుస్తోంది. ప్రస్తుతం ఎవరి సీటుకూ ఇబ్బంది లేదని చెబుతున్నప్పటికీ ఇప్పటికే అధిష్టానం దృష్టిలో పలువురు ఎంఎల్‌ఎలపై అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఎంఎల్‌ఎలు సైతం అధిష్టానం మెప్పు కోసం గడపగడపకూ కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో రెండు జిల్లాల్లోనూ దాదాపుగా సగం స్థానాల్లో కొత్త అభ్యర్థులు వచ్చే అవకాశం ఉందనే అంచనాలు మాత్రం సాగుతున్నాయి. ఆశావహులు సైతం ఇప్పటి నుంచే టిక్కెట్ కోసం పైస్థాయిలో పావులు కదుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. రెండు రోజుల్లో జరగబోయే సమీక్షా సమావేశంలో పలు నియోజకవర్గాల ఎంఎల్‌ఎల పనితీరుపై జగన్ చేసే హెచ్చరికలతో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే మార్చి వరకూ గడపగడపకూ కార్యక్రమం ఉండటంతో సిట్టింగు ఎంఎల్‌ఎల పనితీరులో మార్పునకు అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది.










