Oct 01,2023 21:02

సిటింగుల్లో గుబులు

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మాటలు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తున్నాయి. చాలా వరకు వారిలో అయోమయ పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ పైకి మాత్రం గంభీరం ప్రదర్శిస్తూ సీట్లపై దీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కొంతమంది సిట్టింగులకు ఉద్వాసన తప్పదని వైసిపి అధినేత జగన్‌ చాలా క్లారిటీగానే చెప్పిన విషయం తెలిసిందే. పార్టీ అధినేత తన క్యాంపుకార్యాలయంలో ఇటీవల ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నాయకులతో సమీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికలు, సీట్ల కేటాయింపు తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా 'మీలో చాలా మందికి మళ్లీ టిక్కెట్లు రావచ్చు. కొంతమందికి ఇవ్వలేకపోవచ్చు. టిక్కెట్‌ వచ్చినా, రాకపోయినా మీరు నా మనుషులే. ఎన్నికల్లో తప్పులు జరక్కూడదని తీసుకున్న నిర్ణయాలకు అందరూ సహకరించాలి' అంటూ జగన్‌ స్పష్టం చేశారు. దీంతో, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో ఎవరిని బరి నుంచి తప్పిస్తారో? అన్న అసక్తికర చర్చ కూడా ఎమ్మెల్యేలతోపాటు వారి అనుయాయులు, కార్యకర్తల్లోనూ మొదలైంది. విజయనగరం జిల్లాలో ఏడు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి. వీరిలో కొంతమంది పనితీరు బాగోలేదని కూడా గతంలో సిఎం పరోక్షంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. వీరిలో ఈసారి మంత్రులిద్దర్నీ ఎంపీలుగా పోటీ చేయించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా కూడా చాలా కాలంగా చర్చనడుస్తోంది. ఈ సంగతి కాస్త పక్కనబెడితే సిట్టింగుల్లో పార్టీ అధినేత జగన్‌ సర్వేలో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయనేది ఇంకా బహిర్గతం కాలేదు. ఈ మాటకొస్తే కేవలం పనితీరు ఒక్కటే ప్రమాణికం కాదని, సంబంధిత నియోజకవర్గాల్లో ప్రజల స్పందన, ఆయా ఎమ్మెల్యేలను అభిమానించడం లేదా అసంతృప్తి వ్యక్తం చేయడం వంటివన్నీ పరిణగనలోకి తీసుకుంటారని పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని రాజకీయ పరిస్థితులను భేరీజు వేస్తే గతం మాదిరిగా వైసిపికి వన్‌వే కనిపించడం లేదు. కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యంగా గజపతినగరం, నెల్లిమర్ల, కురుపాం, బొబ్బిలి, రాజాం, పాలకొండ, ఎచ్చెర్ల, విజయనగరం నియోజకవర్గాల్లో పార్టీ పథకాలపై తప్ప, స్థానిక ఎమ్మెల్యేలపై ప్రజలేమీ అంత సంతృప్తికరంగా లేరని అదే రాజకీయ పార్టీకి చెందిన నాయకులే విశ్లేషిస్తున్నారు. అటు ఎస్‌.కోటలో పార్టీకి కొంత అనుకూలంగా వున్నప్పటికీ అంతర్గత విభేదాలు తారా స్థాయికి చేరాయి. కార్యకర్తలకన్నా నాయకులే ఎక్కువగా ఉండడం ఇందుకు కారణం. పార్వతీపురం ఎమ్మెల్యే జనంలో తలలో నాలుకలా ఉన్నప్పటికీ ప్రతిపక్షం తీసుకునే రాజకీయ వ్యూహాన్ని బట్టి ఆయనకు అనుకుల, ప్రతికూల పరిస్థితులు అంచనా వేయడం సాధ్యమౌతుంది. పార్టీ ఇచ్చిన పిలుపుల్లో భాగంగా ప్రజల్లో తిరగడంలో మాత్రం వీరిలో ఎవరూ పెద్దగా వెనుకబడినట్టుగా కనిపించడం లేదు. ఈనేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సీట్ల విషయమై అధినేత అంతర్గత సర్వేపై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. మొత్తంగా ఈ రెండు జిల్లాల్లోని సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో టిక్కెట్ల గండం ఎవరికి ఉందనేది సంక్రాంతి వరకు బయటపడే అవకాశాలు లేవని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. టిక్కెట్ల రావనే విషయం ముందస్తుగానే బహిర్గతం చేస్తే అసంతృప్తితో పార్టీకి నష్టం చేకూరే నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకుండా పార్టీ అధిష్టానం చాకచక్యంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. అందుకే ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇచ్చినా, ఇవ్వకపోయినా అందరూ తన మునుషులే అన్న విధంగా భావిస్తానంటూ పార్టీ అధినేత జగన్‌ చెప్తున్నారని పలువురు గుర్తు చేస్తున్నారు.