ప్రజాశక్తి-పాడేరు:పాడేరు ఏజెన్సీలో శిశు మరణాలను అరికట్టడానికి చేపడుతున్న చర్యలలో భాగంగా గర్భిణిలకు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత, పాలు పట్టే విధానం, తీసుకోవలసిన జాగ్రత్తలు, వ్యాధినిరోధక టీకాల ప్రాముఖ్యత పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ సూచించారు.వైద్య సిబ్బంది, హెల్త్ ఎడ్యుకేటర్‌లకు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దృశ్య, శ్రావ్య పద్దతి ద్వారా శిక్షణ ఇచ్చారు. అల్లూరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ డాక్టర్ జమాల్ బాషా, ఆర్.టి.సి ఫిమేల్ సెంటర్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుజాతలు తల్లి పాలు పట్టే విధానం, ప్రాముఖ్యత, బర్ఫింగ్, సప్లిమెంటరి ఫీడింగ్ పద్దతులపై విఫులంగా తెలిపారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, శిక్షణ పొందిన సిబ్బంది పి.హెచ్.సి పరిధిలోని ఇతర క్షేత్ర సిబ్బందికి, ఆశా కార్యాకర్తలకు, కమ్యూనిటి హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. గ్రామ స్ధాయిలో శిశు మరణాలను అరికట్టాలని సూచించారు. గ్రామాల్లో మహిళలకు ఆరోగ్య కార్యక్రమాలపై చైతన్యం కల్పించేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాడేరు అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కే.లీలాప్రసాద్, జిల్లా లెప్రసి, ఎయిడ్స్, టిబి అధికారి విశ్వేశ్వరరావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి ప్రభావతి పాల్గొన్నారు.










