ప్రజాశక్తి-హుకుంపేట:శిశుమరణాలను నియంత్రిం చాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జమాల్ భాషా సూచించారు. హుకుంపేట ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గూడ గ్రామంలో నిర్వహిస్తున్న ఫ్యామిలీ ఫిజిషియన్ క్యాంపును ఆయన శనివారం పరిశీలించారు. ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య శిబిరంలో నిర్వహిస్తున్న ఇసిజి, రక్తపోటు, హిమోగ్లోబిన్ శాత నిర్ధారణ పరీక్షలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ శిభిరాలను సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు. అనంతరం గొచ్చరి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో వ్యాక్సినేషన్‌ను పరిశీలించి చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. సకాలంలో గర్భిణులను గుర్తించి నమోదు చేసి, ఐఎఫ్‌ఏ మాత్రలు ఇవ్వాలన్నారు. పిహెచ్‌సిని సందర్శించి గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. గర్భిణుల సమస్యలను అడిగి తెలుసుకుని రికార్డులను తనిఖీ చేశారు. గడుగుపల్లి గ్రామంలో శిశు మరణానికి గల కారణాలను తల్లి, ు కుటుంబ సభ్యులకు అడిగి తెలుసుకున్నారు.ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే తల్లిదండ్రులు గుర్తించి సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తక్షణమే తరలించి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. శిశు మరణాలకు గల కారణాలపై తక్షణమే సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాడేరు వైద్యాధికారి నీరజ, జిల్లా టి.బి పర్యవేక్షకులు వి.కిరణ్, పిహెచ్‌సి హుకుంపేట వైద్యాధికారి మెహర్ సుమన, ఆరోగ్య విస్తరణ అధికారి బి.లక్ష్మణ్, అంగన్వాడీ సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.










