Jun 17,2023 00:26

సమావేశంలో పాల్గొన్న పలు సంఘాల నాయకులు

ప్రజాశక్తి- అనకాపల్లి
సిసిఆర్‌సి మార్పు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పలు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక దొడ్డి రాము నాయుడు కార్మిక కర్షక నిలయంలో జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ పదిమందికి కూడా గుర్తింపు కార్డులు అందలేదని, ఈక్రాప్‌ కూడా సాగుదారుని పేరు మీద నమోదు కాలేదని, పంట నష్ట పరిహారం సైతం నష్టపోయిన కౌలు రైతులకు కాకుండా భూ యజమానికే చెందుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలు, ఎరువులు, ఇన్‌పుట్‌ సబ్సిడీ సైతం పంటలు పండించని భూస్వాములే పొందుతున్నారని తెలిపారు. రైతు భరోసా సైతం కౌలు రైతులకు అందడం లేదని, దీని వల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల సమస్యలపై టిడిపి, జనసేన పార్టీల వైఖరి తెలియజేయాలని కోరారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాలు రైతులకు వ్యతిరేకంగా భూస్వాములకు అనుకూలంగా వ్యవహరిన్నాయని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కౌలు రైతుల రక్షణ కోసం తగిన చట్టాలు తేవాలని, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని, రైతు రుణమాఫీ కోసం కేరళ తరహా చట్టాన్ని దేశవ్యాప్తంగా తేవాలని సమావేశం డిమాండ్‌ చేసింది. ఈ సమావేశంలో రైతు నాయకులు ఎ.బాలకృష్ణ బాలు గాడి, బుజ్జి, బత్తిన నాగేశ్వరరావు పాల్గొన్నారు.