Apr 28,2023 21:13

సమావేశంలో మాట్లాడుతున్న గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి

ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో కౌలు రైతులందరికీ సిసిఆర్‌సి కార్డులు మంజూరయ్యేలా రెవెన్యూ అధికారులు, వ్యవసాయాధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి వ్యవసాయ సలహామండలి సమావేశంలో కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, సలహామండలి జిల్లా అధ్యక్షులు నల్లపాటి శివరామకష్ణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో వ్యవసాయ సహాయకులు, రెవెన్యూ అధికారులు భూ యజమానులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి, సిసిఆర్‌సి కార్డులు అందించేలా చర్యలు తీసుకోవాలని, దీని కోసం జిల్లా స్థాయి అధికారులు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పర్యవేక్షణ చేయాలని చెప్పారు. పంట కాల్వలు, డ్రెయిన్ల పూడికతీత, నిర్వహణ పనులు వీలైనంత వరకూ అయకట్టు రైతు సంఘాలకు అప్పగించాలని సూచించారు. మే మొదటి వారానికి పంట కాల్వలు, డ్రెయినేజీ కాల్వల్లో అపరేషన్లు, నిర్వహణ పనులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని అన్నారు. రానున్న ఖరీఫ్‌కు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు ఆర్బీకేలలో అందుబాటులో ఉంచాలని, పచ్చిరొట్టె విత్తనాలను అవసరం మేరకు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకో వాలని చెప్పారు. వైఎస్‌ఆర్‌ యంత్రసేవా పథకం ద్వారా సీహెచ్సీలు, క్లస్టర్‌ సీహెచ్‌సిలకు మే 30 నాటికి యంత్రాలను గ్రౌండింగ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. శివరామకృష్ణ మాట్లాడుతూ ఇరిగేషన్‌ కెనాల్స్‌ అపరేషన్స్‌, నిర్వహణ పనులు స్థానిక రైతు సంఘాలకు అప్పగించటం ద్వారా సకాలంలో పనులు పూర్తి అవుతాయని అన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి నున్న వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యాన అధికారి సుజాత, ఏపీఎంఐపీ పీడీ వజ్రశ్రీ, మార్కెఫెడ్‌ డీఎం కృష్ణారావు, ఏపీ సీడ్స్‌ డీఎం సుబ్బయ్య పాల్గొన్నారు.