ప్రజాశక్తి - పార్వతీపురం : ప్రస్తుతం వ్యవసాయ పనులు ప్రారంభదశలో ఉన్నాయని, రైతులకు ఆర్థిక భరోసా కల్పించాల్సిన సమయమిదేనని, కావున జిల్లాలో సిసిఆర్సి కార్డు గల పదివేల మంది రైతులు, కౌలురైతులు, డిపట్టా రైతులందరికీ వ్యవసాయ పంట రుణాలను నూరు శాతం మంజూరు చేయాలని కలెక్టరు నిశాంత్‌కుమార్ బ్యాంకు అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో బ్యాంకు అక్కౌంట్లు నిర్వహణ, బ్యాంకుల లక్ష్యాలు, రుణాల మంజూరుపై బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే పదేళ్లు పైబడి నిర్వహణలో లేని వ్యక్తిగత బ్యాంకు అక్కౌంట్లను గుర్తించి సంబంధికులకు అందులో గల డబ్బులను అందించాలని తెలిపారు. డిపాజిట్లును సంబంధిత అక్కౌంట్లు హౌల్డర్లకు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బ్యాంకర్లను కోరారు. ప్రజలు, సచివాలయ సిబ్బంది సహకరించి నిర్వహణలో లేని అక్కౌంటుదారులు ఇ-కెవైసీ చేయించుకొని అక్కౌంటులో గల డబ్బులను పొందాలని కోరారు. మత్స్యకారులకు, పశుపెంపకందార్లకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు పంపిణీ చేయాలని, దీని ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రుణాలు మంజూరు చేయాలని అన్నారు. పాడిపశువుల కొనుగోలుకు హామీలేని రుణాలను బ్యాంకులు అందిస్తున్నాయని, వాటిని ప్రజలకు తెలియజేసి ఉపయోగించుకొనేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆర్థిక వనరులు అందించేందుకు నీతిఆయోగ్ పొందుపర్చిన పారామీటర్స్ ప్రకారం పర్యవేక్షిస్తారని, ఆయా అంశాలకు సంబంధించి లక్ష్యాలను పూర్తిచేయాలని తెలిపారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ జె.ఎల్.ఎన్ మూర్తి మాట్లాడూతూ ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలకు సంబంధించి లోను ధరఖాస్తులకు రుణాలు మంజూరు చేయాలని, స్వయం సహాయక సంఘాలకు పశువుల యూనిట్లు ఏర్పాటుకు బ్యాంక్లర్లు ప్రోత్సాహమివ్వాలన్నారు. సమావేశంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎల్డిఎల్ నాగప్రవీణ్, జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, జిల్లా మత్స్య అధికారి వేమూరి తిరుపతయ్య, డిఆర్డిఎ పిడి పి.కిరణ్‌కుమార్, టిపిఎంయు ఎపిడి వై.సత్యంనాయుడు, జిల్లా పరిశ్రమల అధికారి పి.సీతారామ్, ఇతర బ్యాంకుల నియంత్రణ అధికారులు పాల్గొన్నారు.










