Sep 10,2023 20:14

లబ్ధిదారులతో మాట్లాడుతున్న గుమ్మనూరు జయరామ్‌

ప్రజాశక్తి - దేవనకొండ
తాగునీటి సమస్యను పరిష్కరించి, సిసి రోడ్లు, డ్రెనేజీ నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను కుంకునూరు గ్రామస్తులు కోరారు. ఆదివారం ఆ గ్రామంలో 'గడపగడపకు మన ప్రభుత్వం' నిర్వహించారు. మంత్రి గుమ్మనూరు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని మాల కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, సిసి రోడ్లు, డ్రెయినేజీ కాలువలు లేవని ప్రజలు విన్నవించారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ... 'గడపగడపకు మన ప్రభుత్వం'లో భాగంగా సచివాలయానికి మంజూరయ్యే రూ.20 లక్షలతో, మండల అభివృద్ధి గ్రాంటుతో గ్రామంలో సిసి రోడ్లు, డ్రెయినేజీ కాలువల నిర్మాణాలు చేపడతామని తెలిపారు. రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్స్‌ కింద ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన తక్షణమే ఇంటింటికీ కుళాయి నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు. గత టిడిపి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో అవినీతి, అక్రమాలు పాల్పడినందున సిఐడి అధికారులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారన్నారు. ఇన్‌ఛార్జీ ఎంపిడిఒ ఇద్రుస్‌ బాషా, ఎఒ సురేష్‌ బాబు, పిఆర్‌ ఎఇ ఉదరు కుమార్‌, వైఎస్‌ఆర్‌ క్రాంతి పథం సిసి నరసన్న, మంత్రి సోదరులు గుమ్మనూరు నారాయణ స్వామి, శ్రీనివాసులు, జడ్‌పిటిసి కిట్టు, వైసిపి మండల కన్వీనర్‌ కప్పట్రాళ్ల మల్లికార్జున, సర్పంచి వీరమ్మ, వైసిపి నాయకులు దివాకర్‌ నాయుడు, ప్రేమ్‌ నాథ్‌ రెడ్డి, వెలమకూరు రామచంద్ర, పల్లెదొడ్డి చంద్రన్న, మల్లికార్జున రెడ్డి, పరమేష్‌, జగదీష్‌, రామాంజనేయులు పాల్గొన్నారు.