కడప అర్బన్ : జిల్లాలో సాగుబడికి అనువైన ఆయిల్ పామ్ పంట సాగు ద్వారా సిరులు కురిపించే దిగుబడితో పాటు, రైతులకు లాభదాయకమైన మార్కెటింగ్ సదుపాయం అందనుందని కలెక్టర్ వి.విజరు రామరాజు తెలిపారు. శనివారం కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా ఉద్యాన శాఖ, సువెన్ ఆగ్రో ఇండిస్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలో నూతన పంటగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూ రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జి కలెక్టర్‌తోపాటు రాష్ట్ర ఉద్యాన సలహాదారు పి. శివప్రసాద్ రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు బలరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా ఆయిల్ పామ్ పంటను సాగు చేసేందుకు ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలోని బి.మఠం, మైదుకూరు, ప్రొద్దుటూరు, కాశినాయన, పులివెందుల మండలాల్లో మొత్తం 200 హెక్టార్లలో ఉద్యాన పంటగా ఆయిల్ పామ్ పంటను సాగు చేసేందుకు ప్రభుత్వం నిర్దేశించిందని చెప్పారు. ఎన్‌ఎంఇఒ ఒపి పథకం ద్వారా ఈ పంట సాగుకు కేంద్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోందన్నారు. ఈ పంట సాగు ద్వారా రైతులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయన్నారు. రైతులకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా అనేక రాయితీలను ప్రకటించిందన్నారు. మొక్కల పెంపకం ఖర్చు నిమిత్తం దేశవాళీ రకానికి అయితే హెక్టారుకు రూ.20,000, విదేశీ రకానికి అయితే హెక్టారుకు రూ. 29,000లు ఇస్తుందన్నారు. ఎరువులు, అంతర పంటల సాగు నిర్వహణ కోసం నలుగేళ్లకు గాను హెక్టారుకు రూ.42,000 అందిస్తోందని తెలిపారు. డ్రిప్ పరికరాల కోసం రాయితీ మొత్తం వర్తిస్తుందని చెప్పారు. మొక్కలు నాటిన 4 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు నిరంతర ఆదాయాన్ని అందిస్తాయన్నారు. పంట సాగుకు ప్రభుత్వ రాయితీలు అందించడంతో పాటు పంట దిగుబడి వచ్చాయక దళారీల ప్రమేయం లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కంపెనీ వారి నుంచి నేరుగా ఫలసాయాన్ని కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. దాదాపు అన్ని రకాల నేలలకు ఈ పంట అనుకూలమని, నీరు నిలువని లోతైన ఒండ్రు నేలలు, అధిక సేంద్రీయ పదార్థం కలిగి, నీరు తేలికగా ఇంకిపోయే స్వభావాన్ని కలిగిన నేలలు ఈ మొక్కల సాగుకు అనుకూలం అన్నారు. ఎలాంటి చీడపీడల బెడద లేని ఆయిల్ పామ్ ఎక్కువ దిగుబడికి సమద్ధిగా సాగు నీరు అవసరం అవుతుందని తెలిపారు. వేసవికాంలోనూ నీటి లభ్యత ఉన్న బోరు బావుల కింద సాగు చేసుకోవచ్చన్నారు. ఒక ఎకరం వరి సాగుకు అవసరమయ్యే నీటితో 3-4 ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేపట్టవచ్చన్నారు. ఆయిల్ పామ్ సాగు బడిలో అంతర పంటలను కూడా సాగు చేసుకుని రైతులు అదనపు ఆదాయాన్ని కూడా అందుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్న జిల్లా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం సబ్సిడీతో ప్రభుత్వం మంజూరు చేసిన ఆయిల్ పామ్ మొక్కలను రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సువెన్ ఆగ్రో ఇండిస్టీస్ జీఎం పి.ఎం. కొండారెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రాజీవ్ మైఖేల్, జిల్లా వ్యవసాయ శాఖాధికారి నాగేశ్వరరావు, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.