Apr 18,2023 23:35

పట్టణ ప్రాథమిక వైద్య కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి అమర్‌నాథ్‌

ప్రజాశక్తి-అనకాపల్లి
జీవీఎంసీ విలీన గ్రామం శిరసపల్లిలో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా 84వ వార్డులో కోటి 30 లక్షల రూపాయలతో నిర్మించిన వైయస్సార్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలను, మందులను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిని ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో సీఎస్‌ఆర్‌ నిధులతో కమ్యూనిటీ భవనం నిర్మించేందుకు జీవీఎంసీ నుంచి అవసరమైన అనుమతులు రప్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎన్టీఆర్‌ కాలనీలో పర్యటించారు. స్థానికులు గ్రామంలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్‌ నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. దీనిపై స్పందిస్తూ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రూ. 20 లక్షలతో చేపట్టనున్న సిసి రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌ కుమార్‌, ఎంపీపీ గొర్లి సూరిబాబు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పలక యశోద రవి, కార్పొరేటర్‌ మాదంశెట్టి చిన్న తల్లి నీలబాబు, జెసిఎస్‌ ఇన్చార్జి కొణతాల మురళికృష్ణ, 84వ వార్డు వైసిపి నాయకులు ఈగల మహేష్‌, కె సురేష్‌, గొల్లవిల్లి నరసింగరావు, కోరుకొండ రాఘవ, ఆళ్ల నాగేశ్వరరావు, కె శంకర్‌, మలసాల కిషోర్‌ పాల్గొన్నారు.