
'ఏరువలె నిరంతరమును బాఱుచుండు/ గాలివోలె నెల్లప్పుడు గదలుచుండు/ ధరణి రీతి రేల్బవలును దిరుగుచుండు/ క్షణము విశ్రాంతి నెఱుగడు గద భటుండు' అంటాడు చిలకమర్తి. అలాగే నిత్యం రోగుల సేవలో తలమునకలయ్యే నర్సులు కూడా విశ్రాంతి, విరామం లేకుండా తమ విధులను నిర్వర్తిస్తుంటారు. తెల్లని మల్లెపూవుల్లాంటి దుస్తులు ధరించి... నెత్తి మీద చిన్న టోపీ, చెరగని చిరునవ్వు, ఆప్యాయమైన పలకరింపులతో మన కళ్ల ముందు కదలాడే సేవామూర్తులు...నర్సులు. వయస్సులో చిన్నవారైనా మనస్సులో ఎంతో పెద్దరికం వారిది. వార్డులోని రోగులే జగమంత కుటుంబంగా భావించేే మానవతామూర్తులు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలందించిన ధీరవనితలు. సేవకు...మానవత్వానికి ప్రతీక నర్సులు. పుట్టిన బిడ్డకు తొలి స్పర్శ ఆమెదే, చనిపోయే ముందు చివరి చూపూ ఆమెదే. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంతవరకు ఏదోక సమయంలో ఆమె స్పర్శ లేకుండా, ఆమె సేవలు పొందకుండా ఈ జీవిత గమనం ముగియదంటే అతిశయోక్తి కాదేమో. అందుకే 'లేడీ ఆఫ్ ది ల్యాంప్' ఫ్లోరెన్స్ నైటింగేల్ అందించిన సేవలకు గుర్తుగా ఇప్పటికీ లాంతరు పట్టుకున్న స్త్రీ బొమ్మను నర్సులకు ప్రతీకగా చూపుతారు. అది వారి వృత్తికి, వారి సేవాతత్పరతకు ఇచ్చే గౌరవం.
వాస్తవానికి డాక్టర్ల కంటే నర్సులే రోగుల వద్ద ఎక్కువ సమయం గడుపుతుంటారు. కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా నర్సులందించిన సేవలు జగద్విదితమే. కరోనా ఆవరించిన ప్రపంచాన్ని స్వస్థపరిచేందుకు ఫ్రంట్‌లైన్ వారియర్లుగా రాత్రింబవళ్లూ వారు నిర్వహించిన పాత్ర మాటలకందనిది. కుటుంబాలను విడిచి, తమ ప్రాణాలను ఫణంగా పెట్టి... నర్సులు తమ వంతు సేవలందించారు. కరోనాకు కొందరు బలైనా...అధైర్యపడకుండా బాధితులకు బాసటగా నిలిచిన వీరవనితలు నర్సులు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా భారతీయ నర్సులే దర్శనమిస్తుంటారు. దీనికి కారణం... వృత్తిలో అత్యంత నైపుణ్యత, నిబద్ధత... మాటలో ఆప్యాయత, ఆత్మీయత వీరికి పెట్టని కోటలుగా వుంటాయి. చెదరని చిరునవ్వుతో, సడలని ఆత్మవిశ్వాసంతో తమ హృదయాలను తెరచి... రోగులను సాదరంగా ఆహ్వానించే 'సిరంజీవులు' మన నర్సులు. 1973 నుండి మన దేశంలో నర్సు వృత్తిలో విశేషమైన సేవలందించిన వారికి ప్రతియేటా 'ఫ్లోరెన్స్ నైటింగేల్' అవార్డును బహూకరిస్తున్నారు. వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన నైటింగేల్ పుట్టినరోజైన మే 12న 'అంతర్జాతీయ నర్సుల దినోత్సవం' జరుపుతున్నారు. దీనితోనే వారి సమస్యలు తీరవు. ప్రభుత్వం వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి, నర్సుల సేవలు, వారి విజ్ఞానం దేశానికి అందేలా చూడాలి. విద్యా, వైద్య రంగాన్ని మొత్తంగా ప్రభుత్వ పరం చేసి అందరికీ విద్య, వైద్యం అందించాలి.
దేశంలో అర్హత... నిపుణత కలిగిన నర్సులు వున్నప్పటికీ... తగిన అవకాశాలు లేక, తగిన గుర్తింపు రాక... సరైన వేతనాలు లేక ఉపాధి కోసం విదేశాలకు తరలిపోతున్నారు. ప్రతి ఏడాదీ ఎంతో మంది విద్యార్థులు నర్సింగ్ శిక్షణ పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు. వీరికి అవసరమైన ఉద్యోగాల్లేవు. ప్రభుత్వాలు పర్మినెంట్ పోస్టుల భర్తీని ఎప్పుడో నిలిపివేశాయి. మరోవైపు పెరుగుతున్న జనాభాకు సరిపడినంతమంది లేక కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తున్నారు. ఇచ్చే అరకొర జీతాలు కూడా సమయానికి అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులను, ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. చాలీచాలని జీతాలు, అర్థాకలి జీవితాలు, లైంగిక వేధింపులు, తిట్లు, చీదరింపులు వంటివి వారి జీవితాల్లో పైకి కనిపించని చీకటి కోణం. తెల్లని వస్త్రాలతో మెరిసిపోయే నర్సుల జీవితాల్లో కష్టాల కడగండ్లు నీడలా వారి వెన్నంటే వుంటాయి. ప్రభుత్వాలు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసి, నర్సులకు సముచిత గౌరవం కల్పించాలి. వారి విజ్ఞానం దేశానికి ఉపయోగపడేలా, వారి సేవలు ప్రజలందరికీ లభ్యమయ్యేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. 'ప్రార్థించే పెదవుల కన్నా... సాయం చేసే చేతులు మిన్న' అన్న మదర్ థెరిస్సా స్ఫూర్తి నేటి ప్రపంచానికి ఆదర్శం కావాలి. వైద్య వృత్తిని ఒక తపస్సులా భావించి సేవలందిస్తోన్న నర్సులు... యావత్ ప్రజానీకానికి అందించే సేవలకు, వారి మానవతకు సెల్యూట్ చేద్దాం. వారికి మన మద్దతు తెలుపుదాం.