May 23,2021 14:46

మల్లెలోయమ్మ మల్లెలు మల్లె విరులు
మనసు దోచేటి మల్లెలు మగువలకును
మగలకును, మనోల్లాస సమాగమంపు
సరసగుళికలు, రమణీయ విరి కళికలు

 ... ఇలా చెప్పుకుంటూ పోతే మల్లెకున్న ప్రత్యేకతలెన్నో... మండు వేసవిలో ఎండ కణకణలాడుతుంటే కళకళలాడుతూ సుగంధమల్లెలు ధవళ దరహాసాలు విరబూస్తాయి. తుప్ప జాతికి చెందిన వీటిలో చాలా రకాలున్నప్పటికీ పందిరిమల్లి, సన్నజాజులు, విరజాజులు, కాగడాలు, తుప్పమల్లి అనేవి మనకు లభించే రకాలు.
   మాఘమాసం (ఫిబ్రవరి) నుంచి జులై వరకూ మల్లెలు పూస్తాయి. వేసవి సీజన్లో ఇవే మహారాణులు. అలంకరణకు, మగువలు తల్లో తురుముకునే మాలలు, సౌందర్య సాధనాల్లోనూ, సుగంధ లేపనాల్లోనూ మల్లెపువ్వులను ఉపయోగిస్తారు. పెళ్లిళ్ల లగ్గసరి సీజన్లో కిలో 100 నుంచి వెయ్యి రూపాయల వరకూ డిమాండ్‌ ఉంటుంది. చల్లని మల్లెలు ఎక్కడున్నా హాయి వెన్నెల కురిపిస్తాయి. మన రాష్ట్ర అధికార పుష్పం మల్లెపువ్వు. తెలుగు సినిమాలో మల్లెపువ్వులపై ఉన్నన్ని గీతాలు మరే పువ్వులకూ లేవు. మల్లెల్ని ఇంటివద్ద పెరటితోబాటు, తోటలుగా వేసి రైతులు పెద్దఎత్తున జీవనోపాధి పొందుతున్నారు.

                                                                          తుప్పమల్లి

 తుప్పమల్లి

తుప్ప మల్లి, దేశవాళీ మల్లి అన్నా ఒకటే. మొగ్గలు చిన్న బల్బులు మాదిరిగా ఉంటాయి. కోసిన కొద్ది గంటల్లోనే విచ్చుకుంటాయి. దండలు కట్టడానికి, డెకరేట్‌ చేయడానికి వీటినే ఎక్కువగా ఉపయోగిస్తారు. అందుకే రైతులు వీటిని పెద్దమొత్తంలో తోటలు వేసి సాగుచేస్తారు. మొక్క తుప్ప లాగా, గంత లాగా పెరుగుతుంది. అందువల్లే దీనిని తుప్ప మల్లి అంటారు. ఒకసారి వేసిన తోట ఐదారు సంవత్సరాలు ఉంటుంది. సీజన్లో పువ్వులు కాస్తుంది. రైతులు మల్లె తోటలో మొక్కల మధ్యన చిక్కుడు, పర్చిమిర్చి వంటి కూరగాయలు వేసి అంతర పంటగా సాగుచేస్తారు. పువ్వులు లేని సమయంలో కూరలు పండుతాయి. మల్లెపూల నుంచి తీసే తైలం ధర కిలో లక్షల్లో ఉంటుంది. కుండీల్లో, నేలమీద పేరట్లో ఇంటివద్ద కూడా వీటిని పెంచుకోవచ్చు.

                                                                        సన్నజాజులు

సన్నజాజులు


చాలా నాజుగ్గా, సన్నగా, అందంగా, తెల్లగా ఉండే పూల మొక్క. వీటిని మొక్కలు గాను, పాదు (క్రీపర్‌)గానూ పెంచుకోవచ్చు. ఇవి మొగ్గగా ఉన్నప్పుడు సన్నగా పొడవుగా ఉంటాయి. విచ్చుకుంటే సన్నటి పూ రేఖలతో భలే అందంగా ఉంటుంది. మల్లెకంటే జాజులు మరింత పరిమళభరితంగా ఉంటాయి. పువ్వులు తేజోవంతంగా ఉంటాయి. సాయంకాలం వేళ ఈ పువ్వులు బాగా విచ్చుకుంటాయి. ఈ మొక్క ఆకులు మల్లె ఆకులకంటే చిన్నవిగా, పలసగా ఉంటాయి. సాధారణంగా మే నుంచి అక్టోబర్‌ వరకూ జాజుల సీజన్‌. కానీ, పోషకాహారాలు ఎక్కువ ఉంటే వర్షాకాలం తప్ప మిగతా అన్ని కాలాలూ కొద్దో గొప్పో జాజులు పూస్తూనే ఉంటాయి. జాజులు, మల్లెలు ఇటీవల ఖరీదైన టీ తయారీకి వాడుతున్నారు. జాజిమొక్క మొదలు నీడలో ఉన్న దీని కొమ్మలు ఎండలో ఉంటే సరిపోతుంది. ఇంటిలోపల లేదా కుండీల్లో మొక్క మొదలు ఉంచి తలభాగం ఇంటి పైకప్పు మీదకు, డాబా, పోర్టుకోల మీదికి ఎక్కించి ఈ మొక్కలు లేదా పాదులు పెంచుతారు. దీన్ని స్పానిష్‌, రాయల్‌, కాటలోనియల్‌ జాస్మిన్‌ అని పిలుస్తారు. జాస్మిన్‌ గ్లాండి ఫ్లోరమ్‌ దీని శాస్త్రీయ నామం. ఇది పాకిస్తాన్‌ జాతీయ పుష్పం కూడా. అక్కడ జాజిపూలను చమేలి అంటారు.

                                                                        విరజాజులు

విరజాజులు

అచ్చంగా సన్నజాజుల్లానే ఉంటాయి. కాకపోతే పువ్వు సన్నజాజి కంటే నాలుగు రెట్లు ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో జాజిపువ్వుల పేరుతో అమ్మేవన్నీ విరజాజులే. సన్నజాజులు పంట తక్కువగా వస్తుంది. పైగా ఎక్కువమంది కొస్తేనేగాని పని తెమలదు. విరజాజులు పంట ఎక్కువ, పెద్దపువ్వులు, కోత త్వరగా అవుతుంది. రైతులకి ఇది కాస్త ఆర్థికంగా ఉపయోగపడుతుంది. అందుకే మన ససంప్రదాయ సన్నజాజి మొక్కలు, పువ్వులు నెమ్మదిగా కనుమరుగవుతున్నాయి.

                                                                         కాగడా మల్లి

 కాగడా మల్లి

ఇది కూడా మొక్క. నాటిన రెండేళ్ళకు పూలు కాపుకొస్తాయి.
   పూలు జాజి మల్లె కంటే కాస్త పెద్దవిగా ఉంటాయి. అక్కడక్కడా చిన్ని చిన్ని లేతనీలం చుక్కలు ఉంటాయి. పెద్దగా వాసన ఉండవు. మొక్కకు కాపు ఘనంగా ఉంటుంది. వీటిని దండలు కట్టడానికి, మండపాలు అలంకరించడానికి ఉపయోగిస్తారు. అక్టోబర్‌ నుంచి ఫిబ్రవరి వరకూ ఈ మొక్కలు పుష్పిస్తాయి. వీటి ధర కాస్త తక్కువగానే ఉంటుంది.

                                                                          పందిరి మల్లి

 పందిరి మల్లి

మన సాంప్రదాయ మల్లెల్లో ఇదొకటి. ఇంటి ముంగిట పందిరిలా అల్లుకుని వేసవి సీజన్‌ రాగానే గుప్పుమని తెల్లని నక్షత్ర తలుకుల్లాంటి మల్లెలు విచ్చుకుంటాయి. సుగంధ పరిమళాలు వెదజల్లుతాయి. పువ్వులు సన్నజాజులు కంటే పెద్దగా ఉంటాయి. ఇవి కూడా సాయంత్రం వేళే ఎక్కువ పూస్తాయి. ఇళ్లదగ్గర వేసుకోవడానికి ఇవి చక్కగా ఉంటాయి. తోటలు వేసి పెంచుకోవడానికి ఇవి పెద్ద లాభదాయకం కాదు.
   నిత్య మల్లి, ఆకాశ మల్లి, రాధామనోహరం, పారిజాతం మల్లెలాంటి పోలికలు, వాసన ఉన్నా ఇవి మాత్రం మల్లి జాతికి చెందిన మొక్కలు కావు.
 

- చిలుకూరి శ్రీనివాసరావు